Bezawada Brothers Success Story: ఆ ఇద్దరు అన్నదమ్ములు ఇంజినీరింగ్ చదివారు. ఉద్యోగాలు చేస్తుండగా.. కరోనా రాకతో జీవనోపాధి పోయింది. అయినా భయపడలేదు. నచ్చిన రంగాన్ని ఎంచుకున్నారు. హేళనలు, అవాంతరాలు ఎదురైనా.. పట్టువిడువలేదు. దేశంలోని వివిధ ప్రాంతాలు సంచరిస్తూ.. ట్రావెలర్ యూట్యూబర్‌గా అన్న.. కొత్త కొత్త రుచులను ప్రజలకు పరిచయం చేస్తూ.. ఫుడ్ బ్లాగర్‌గా తమ్ముడూ రాణిస్తున్నారు.
విజయవాడలోని భవానీపురంలో నివసిస్తున్న ఈ అన్నదమ్ముల పేర్లు వీరి పేర్లు మహేశ్, శివ. మహేశ్ సాఫ్ట్‌వేర్‌గా.. శివ సివిల్ ఇంజినీర్‌గా పనిచేసేవారు. చిన్నప్పటి నుంచి మహేశ్‌కి ట్రావెలింగ్ అంటే చెప్పలేనంత క్రేజ్. కానీ.. దిగువమధ్య తరగతి కుటుంబం కావడంతో.. నచ్చిన ప్రదేశాలు చూడాలనే కోరిక నెరవేరలేదు. పునెలో సాఫ్ట్ వేర్‌గా పనిచేసే సమయంలో.. తరచూ బైక్‌పై వేరే ప్రాంతాలకు లాంగ్ డ్రైవ్ వెళ్లేవాడు. శివకేమో డైరెక్షన్, కొత్త కొత్త వంటకాలను ఆస్వాదించడంపై అమితాసక్తి.
Young Boy 3D Art with Technology: శిల్పకళకు సాంకేతిక త్రీడీ హంగులు.. జీవం ఉట్టిపడుతున్న విగ్రహాలు
ఆర్థికంగా స్థిరపడుతున్నాం అనుకునేంతలోనే.. లాక్‌డౌన్ వారి జీవితాన్ని కుదిపేసింది. కొన్నాళ్లు గడిచాక.. ఉద్యోగం లేకపోవడంతో.. ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. ఉపాధి కోసం ఏం చేద్దామా.. అని ఎన్నో రకాలుగా వారిద్దరూ ఆలోచించారు. ఉద్యోగం బదులుగా.. వ్యాపారాన్ని మొదలుపెట్టాలనుకున్నారు. విజయవాడపైన ఎవరూ వ్లోగ్స్ చేయలేదని తెలిశాక.. తనకిష్టమైన ట్రావెలింగ్‌నే ఎందుకు ఎంచుకోకూడదనుకున్నాడు మహేశ్. అన్ని విధాలా ఆలోచించి.. బెజవాడ బ్యాక్ ప్యాకర్స్ పేరిట యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించాడు.
తొలినాళ్లలో కొవిడ్ రెండో వేవ్.. వీరి ఉత్సాహంపై నీళ్లు చల్లింది. కొన్నాళ్లు ఆర్థికంగానూ సతమతయ్యారు. ఒకానొకదశలో శివ ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేయాల్సి వచ్చింది. ఉద్యోగాలు చూసుకోకుండా.. ఈ పనులు ఎందుకు చేస్తున్నారనే.. విమర్శలూ ఎదుర్కొన్నారు. అయినా సరే.. అన్నదమ్ములిద్దరూ ఒకరికొకరు తోడుగా ఉంటూ.. కోరుకున్న రంగంలో.. ఆనతికాలంలోనే బెజవాడ బ్రదర్స్‌గా ఫేమస్ అయ్యారు.
మొదట్లో విజయవాడ పరిసర ప్రాంతాలకే పరిమితమైనా.. క్రమంగా రాష్ట్రంలోని, దేశంలోని వివిధ ప్రాంతాలకూ వెళ్లి చిత్రీకరించామన్నారు. విజయవాడ హెచ్‌సీఎల్‌లో ఉద్యోగం లభించడంతో.. ఇక వెనుదిరగలేదన్నారు. ట్రావెలర్‌గా దేశంలోని పలు ప్రముఖ ప్రాంతాలు సందర్శిస్తూ.. వ్లోగ్స్ చేశాడు మహేశ్. దిల్లీ, ముంబయి, కేరళ, హిమాచల్, మనాలీ.. ఇలా అనేక రాష్ట్రాలన్నీ పర్యటించాడు. స్వతహాగా భోజన ప్రియుడైన శివ.. సోదరుని ప్రోద్బలంతో బెజవాడ హంటర్స్‌తో ఫుడ్ బ్లాగర్‌గా మారాడు.
విజయవాడతో మొదలుపెట్టి.. వెళ్లిన ప్రతి ప్రదేశంలోని కొత్త రుచులను పరిచయం చేస్తూ.. ఆదరణ పెంచుకున్నాడు. ప్రస్తుతం వీరికి.. సోషల్ మీడియాలో దాదాపు లక్షన్నర వరకూ ఫాలోవర్లున్నారు. ఎన్నిఆర్థిక నష్టాలూ, కష్టాలూ ఎదురుపడినా చలించలేదు ఈ సోదరులు. మనోనిబ్బరంతో ఆలోచించి.. ఆత్మస్థైర్యంతో ముందడుగు వేసి.. కలని సాకారం చేసుకున్నారు. అన్నేమో.. భవిష్యత్తులో 130 రోజుల్లో దేశాన్ని చుట్టి రావాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే.. తమ్ముడేమో డైరెక్టర్ అవటమే ధ్యేయమంటున్నాడు.