Be alert Cyber criminals have opened a new trend: ''హాలో అండీ.. మేం టెలికం కంపెనీ నుంచి ఫోన్ చేస్తున్నాం. మీ సిమ్‌ను 5జీ నెట్ వర్క్‌కు మారుస్తాం. దానికి మీరు చేయాల్సింది ఏమీ ఉండదు. మీ ఫోన్కు ఒక లింక్‌ను పంపిస్తాము. దానిపై మీరు క్లిక్ చేస్తే చాలు వెంటనే నెట్ వర్క్ 5జీకి మారుతుంది. కాబట్టి మీ ఫోన్‌కు వచ్చిన ఓటిపి నెంబర్ చెప్పండి అని అడుగుతారు. వాళ్ల మాటలు నమ్మి ఓటిపి చెపితే.. నిమిషాల్లో మీ ఖాతాల్లో దాచుకున్న నగదు మాయం చేస్తారు. కావున స్మార్ట్ ఫోన్లు వాడుతున్న ప్రజలు, యువత అప్రమత్తంగా ఉండండి'' అని విజయవాడలో ఉన్న సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకు అలా నిపుణులు చెప్తున్నారు? సైబర్ నేరగాళ్లు 5జీ పేరుతో ఫోన్లు కూడా చేస్తున్నారా? అనే తదితర సందేహాలపై నిపుణులు పలు కీలక విషయాలను వెల్లడించారు.
నిపుణుల తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుత రోజుల్లో మొబైల్‌ను వినియోగించని వ్యక్తి ఉండరంటే ఆశ్చర్యం లేదనే చెప్పాలి. అధిక సామర్థ్యం ఉన్న వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవటం, అప్‌లోడ్ చేసుకోవడం, వీడియో కాల్స్, తదితర అవసరాలు రానూరానూ ఎక్కువైపోతున్నాయి. దీంతో వినియోగదారుల బలహీనతల్ని ఆసరాగా చేసుకుని నగదు కాజేసేవాళ్లు కూడా పెరిగిపోతున్నారు. మీ చరవాణిలో 5జీ సేవలను పొందాలంటే మీకు వచ్చిన సందేశంలోని లింకును క్లిక్ చేస్తే చాలు అంటూ సైబర్ నేరగాళ్లు తమ పనిని మొదలుపెడతారు. ఆ తర్వాత మీ ఫోన్కు ఒక లింక్ వచ్చింది దానిని క్లిక్ చేయగానే నేరుగా 5జీలోకి మారిపోతుంది అంటూ బోల్తా కొడతారు.
అలా నమ్మి లింక్‌ని క్లిక్ చేస్తే.. వ్యక్తిగత సమాచారంతో పాటు, బ్యాంకుకు సంబంధించిన యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లు కూడా వారి చేతికి వెళ్లిపోతాయి. ఆ తర్వాత టెలికాం సంస్థ నుంచి కాల్ చేస్తున్నట్లు మనల్ని నమ్మిస్తారు. మీరు మా అమూల్యమైన వినియోగదారులు కావటంతో మిమ్మల్ని మాత్రమే ఎంపిక చేశామంటూ చెబుతూ.. 5జీకి మారాలంటే సిమ్‌ను మార్చాల్సి ఉంటుందని, మీకు అదంతా అవసరం లేదని మీకు పంపించే ఈ క్యూఆర్ కోడ్ ద్వారా నామమాత్రం రుసుము చెల్లిస్తే పని అయిపోతుందంటూ మభ్యపెడతారు. స్కాన్ చేయటమే ఆలస్యం మన యూపీఐ ఐడీ సమాచారాన్ని సేకరించి మన బ్యాంకులో ఉన్న సొమ్మును కాజేస్తారు అని వివరించారు.
ఈ సందర్భంగా సైబర్ సెక్యూరిటీ నిపుణులు సాయి సతీష్ మాట్లాడుతూ.. ''తాజాగా పటమట ప్రాంతం నివాసి అయిన ఓ యువకుడికి టెలికాం కంపెనీ నుంచి ఫోన్ వచ్చింది. మన విజయవాడలో 5జీ సేవలు మొదలయ్యాయి.. మీ ఊరిలో కూడా ఈ 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయని చెప్పాడు. ఆ తర్వాత లింక్ ద్వారా సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసుకుంటే మీకు 1 జీబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ వస్తుందని ఆ యువకుడిని నమ్మించాడు. అది నిజమే అని నమ్మిన ఆ యువకుడు.. తన ఫోన్‌కొచ్చిన లింక్‌ను ఓపెన్ చేసి వివరాలను నింపాడు. ఆ తర్వాత అతని ఫోన్‌కు వచ్చిన ఓటీపీని కూడా చెప్పాడు. కొద్ది నిముషాల్లోనే ఆ యువకుడి ఖాతా నుంచి రూ. 1.20 లక్షలు డెబిట్ అయినట్లు మేసేజ్ వచ్చింది. ఏం జరిగిందో తెలుకోవాలని ఆ యువకుడు ఆ ఫోన్ నెంబరుకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ఛాప్ అని రావడం మొదలైంది. దాంతో ఆ యువకుడు ఒక్కసారిగా నివ్వెరపోయాడు. ఇక, 5జీ సేవల విషయానికొస్తే.. జనవరిలోనే పలు ప్రధాన నగరాల్లో 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. ఇవి అన్ని ప్రాంతాలకు విస్తరించాలంటే చాలా సమయం పడుతుంది. కంపెనీలు దశలవారీగా తమ టవర్లను అప్‌గ్రేడ్ చేస్తాయి. ప్రస్తుతం లాంఛనంగా విజయవాడ నగరంలో పలు నెట్‌వర్క్ ఆపరేటర్లు మొదలుపట్టారు. ప్రస్తుతం నగరంతో పాటు, చుట్టపక్కల ప్రాంతాల్లో మాత్రమే సిగ్నళ్లు వస్తున్నాయి. త్వరలో మచిలీపట్నంలో సేవలు అందనున్నాయి. కాబట్టి ఈ సంగతి వినియోగదారులు ఖచ్చితంగా గుర్తించాలని నిపుణులు చెబుతున్నారు.
5జీ అప్‌డేట్ పేరుతో కేటుగాళ్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లకు స్పందించవద్దని సూచిస్తున్నారు. వినియోగదారులు 5జీ ఫోన్ వినియోగిస్తే సిగ్నళ్లు వాటంతటవే అందుతాయి. 5జీ ఫోన్ లేకుండా నెట్ వర్క్ మారడం అసాధ్యమనే విషయాన్ని గుర్తించాలని నిపుణులు పేర్కొన్నారు. కొత్త సిమ్ తీసుకోవాలా? సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసుకుంటే సరిపోతుందా? సిమ్ మార్చుకోకుండానే సెట్టింగ్స్‌లో మార్చుకుంటే సరిపోతుందా? అని అనుమానం వస్తే నెట్ వర్క్ కార్యాలయాలకు వెళ్లి నివృత్తి చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇవీ చదవండి