Attack on Dalit youth in NTR district: ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో ఎస్సీ యువకుడు శ్యామ్‌కుమార్‌ను కారులో తిప్పుతూ దారుణంగా హింసించిన ఘటనలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని.. తెలిపారు. కంచికచర్లలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడితో మాట్లాడిన పోలీసులు.. మరిన్ని వివరాలు సేకరించారు.
కుటుంబసభ్యులతో మాట్లాడారు. మెరుగైన వైద్యం కోసం బాధితుడిని.. విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. శ్యామ్‌కుమార్‌పై దాడికి పాల్పడిన నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు డీసీపీ సత్తిబాబు తెలిపారు. ప్రధాన నిందితుడు హరీష్‌రెడ్డి విదేశాలకు వెళ్లకుండా లుక్ అవుట్ నోటీసులు జారీ చేయాలని పోలీసులకు ఆదేశాలిచ్చారు. నిందితులు ఎంతటివారైనా పట్టుకుని.. చట్టపరంగా శిక్షిస్తామని చెప్పారు.
జగన్ జమానాలో మరో దళిత బిడ్డకు ఘోర అవమానం: లోకేశ్
దాహంగా ఉందని నీటి కోసం బతిమాలగా.. ముఖంపై మూత్రవిసర్జన: కంచికచర్లలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన ఎస్సీ యువకుడు శ్యామ్‌కుమార్‌ను.. మాట్లాడాలని పిలిచి.. ఆరుగురు దుండగులు బుధవారం రాత్రి కారులో ఎక్కించుకున్నారు. గుంటూరు వైపు కారును తీసుకెళ్లిన ఆరుగురు యువకులు.. శ్యామ్‌కుమార్‌ను దారిపొడవునా తీవ్రంగా కొట్టారు. దాహంగా ఉందని నీటి కోసం బతిమాలగా.. కారును నిర్మానుష్య ప్రదేశంలో నిలిపి.. ముఖంపై మూత్రవిసర్జన చేశారని.. బాధితుడు వాపోయాడు. శరీరంపై రక్తపు మరకలు ఉండటంతో.. చొక్కాను తీసేసి.. మరో టీషర్టు తొడిగించారని తెలిపాడు. పాత కక్షలను మనసులో పెట్టుకునే.. ఇలా దాడికి తెగబడ్డారని వెల్లడించాడు.
తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్యామ్‌కుమార్‌ను నందిగామ మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం నేత తంగిరాల సౌమ్య, బహుజన జేఏసీ అధ్యక్షుడు బాలకోటయ్య, బీఎస్పీ నాయకులు పరామర్శించారు. సభ్యసమాజం తలదించుకునేలా దాడి చేసిన నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. దాడి ఘటనను నాయకులకు చెబుతుండగానే.. బాధితుడు స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే స్థానిక ప్రైవేటు వైద్యశాలలో చేర్పించారు. బాధితులకు న్యాయం చేయాలంటూ.. రాజకీయ, ప్రజా, ఎస్సీ సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. మంత్రి ఆదిమూలపు సురేష్.. నిందితులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. శ్యామ్‌కుమార్‌కు మెరుగైన వైద్యం అందించి.. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఘటనపై తీవ్రంగా స్పందించిన నారా లోకేశ్: ఎస్సీ యువకుడు శ్యామ్‌కుమార్‌పై అమానుష దాడి ఘటనపై.. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. నాలుగున్నరేళ్ల వైసీపీ పాలనలో ఎస్సీలకు రక్షణ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. జగన్ పాలనలో వైద్యుడు సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం సహా ఎంతో మంది దళిత బిడ్డలు బలయ్యారని.. తాజాగా మరో దారుణం చోటుచేసుకుందని మండిపడ్డారు. సీఎం జగన్‌కు.. ఏ మాత్రం మనస్సాక్షి ఉన్నా.. ఈ అమానవీయ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ప్రభుత్వ చర్యలతో తానే బాధితుడినయ్యానంటూ ఎస్సీ కమిషన్ ఛైర్మన్ విక్టర్ బాబే వాపోవడం.. జగన్ జమానాలో దళితులపై అణచివేత చర్యలకు పరాకాష్ట అని లోకేశ్ దుయ్యబట్టారు.
టీడీపీ నాయకులను అడ్డుకున్న పోలీసులు : వైసీపీ అనుచరుడు హరీష్ రెడ్డి దాడిలో గాయపడిన దళిత యువకుడు కాండ్రు శ్యాం కుమార్‌ను పరామర్శించేందుకు వచ్చిన తెలుగుదేశం నేతలు పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గొల్లపూడి ఆంధ్ర హాస్పిటల్ వద్ద కొంత సమయం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బాధితుడి పరామర్శించేందుకు వెళుతుంటే అడ్డుకోవడంపై టీడీపీ నేతలు ఎంఎస్ రాజు, దేవినేని ఉమ, కేశినేని చిన్ని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎట్టకేలకు పోలీసుల అడ్డంకులను ఛేదించుకుని శ్యాం కుమార్‌ను పరామర్శించారు.