APJAC Bopparaju: విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద ఏపీ ఐక్యకార్యాచరణ సమితి (APJAC) అమరావతి ఉద్యోగ సంఘాల నాయకులు.. నిరాహారదీక్ష చేపట్టారు. ఉద్యోగుల డిమాండ్‌ల పరిష్కారం కోసం.. దశల వారీగా ఉద్యమ కార్యాచరణ చేపట్టిన APJAC అమరావతి సంఘం.. ఈ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ సామూహిక నిరాహారదీక్షకు దిగింది. సామూహిక దీక్షకు APJAC అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు హాజరయ్యారు. అన్నీ జిల్లాల కలెక్టరేట్‌ల వద్ద ఉద్యోగులు సామూహిక దీక్షలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో బొప్పరాజు మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని వైసీపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది కానీ.. ఇప్పటి వరకూ ఆ వారం రాలేదని బొప్పరాజు వెంకటేశ్వర్లు విమర్శించారు. కేంద్రం సూచించిన 14 శాతం పెంపును కూడా అమలు చేయలేదని, పీఆర్సీ ఆరియర్లు ఎప్పటికీ చెల్లిస్తారని ప్రశ్నించారు. ఉద్యోగులకు ఒకటో తేదీన వేతనాలు చెల్లించడంలో ఆలస్యం ఏమిటని నిలదీశారు.
ప్రభుత్వ కాలం కూడా ముగిసిపోయే సమయం వచ్చిందని, అయినా డీఏలు ఇవ్వడం లేదని ఆక్షేపించాకు. ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమ కార్యాచరణ వల్ల ఒక్క డీఏ మాత్రమే ఇస్తామని ప్రకటించారన్నారు. ఏపీ జేఏసీ ఉద్యమం వల్లే 6 వేల కోట్ల రూపాయలు విడుదల చేశారని, రాబోయే కాలంలో ఉద్యమం అంతా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులదేనని స్పష్టం చేశారు. ఉద్యమం చేస్తున్నాం కాబట్టే.. మళ్లీ ఏసీబీ రెయిడ్లు మొదలయ్యాయని, కార్యాలయంలో కాగితాలు కొనుగోలు చేసేందుకు కూడా డబ్బులు ఇవ్వని ప్రభుత్వం ఏసీబీతో దాడులు చేస్తుందని బొప్పరాజు మండిపడ్డారు.
ఏసీబీ దాడుల ద్వారా ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు చట్ట బద్ధంగా రావాల్సిన మొత్తాలు ఇవ్వరని.. పెన్షనర్లకూ పెన్షన్ ఇవ్వడం లేదని అన్నారు. 84 రోజులుగా ఉద్యోగులు ఆందోళనలు చేస్తున్నా.. ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఇక తుది నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఉద్యమం ఆగాలంటే ఉద్యోగుల 50 డిమాండ్లను పరిష్కరించడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం మీన మేషాలు లెక్కిస్తూ ఉంటే ఇక ఉద్యమం తీవ్రంగా మారక తప్పదని హెచ్చరించారు. ఉద్యమం తీవ్రతరం అయితే దాని బాధ్యత ప్రభుత్వానిదేనని బొప్పరాజు వెంకటేశ్వర్లు తేల్చిచెప్పారు.
"సీపీఎస్ రద్దు హామీకి ఇప్పటివరకు అతీగతీ లేదు. కేంద్రం సూచించిన 14 శాతం పెంపును కూడా అమలు చేయలేదు. ఉద్యమ కార్యాచరణ వల్ల ఒక్క డీఏ ఇస్తామని ప్రకటించారు. ఏపీ ఐకాస ఉద్యమం వల్లే రూ.6 వేల కోట్లు విడుదల చేశారు. రాబోయే కాలంలో ఉద్యమమంతా ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులదే. 84 రోజులుగా ఆందోళనలు చేస్తున్నా స్పందన లేదు. ఉద్యమం ఆగాలంటే డిమాండ్లు పరిష్కరించాల్సిందే. 50 డిమాండ్ల పరిష్కారం మినహా ప్రత్యామ్నాయం లేదు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం తీవ్రమవుతుంది.. అలా అయితే ఆ బాధ్యత ప్రభుత్వానిదే"-బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు