Payyavula Keshav fired on AP Chief Minister Jagan: విజయవాడలోని ఎన్టీఆర్ భవన్‌లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు టీడీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ ముఖ్య నేతలు, టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ హాజరయ్యారు. సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన విషయాలపై, అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడుతూ.. అంతరాత్మ ప్రభోధానుసారం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయాలని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఎమ్మెల్యేలను కోరారని తెలిపారు. ఏడు ఎమ్మెల్సీలను ఖచ్చితంగా గెలిపించుకోవాలంటూ.. మంత్రులతో ఇటీవలే సీఎం జగన్ చేసిన కామెంట్ల గురించి టీడీఎల్పీ సమావేశంలో ప్రస్తావించామన్నారు. ఏడు ఎమ్మెల్సీలను గెలుచుకోలేమని సీఎం జగన్ భయపడుతున్నారని పయ్యావుల ధ్వజమెత్తారు.
ఏడు సీట్లూ గెలిపించాలని మంత్రులను సీఎం జగన్ ఎందుకు..? ఆదేశించారని పయ్యావుల ప్రశ్నించారు. ఎమ్మెల్సీ స్థానాలన్నీ గెలుచుకోకుంటే, మంత్రి పదవులు మార్చేస్తానని సీఎం జగన్ ఎందుకు..? హెచ్చరించారని నిలదీశారు. ఏడు స్థానాలను గెలవలేమన్న భయం జగన్‌కు ఉందా..? అని పయ్యావుల ఆక్షేపించారు. అంతరాత్మ ప్రబోధానుసారం ఎవరైనా ఎమ్మెల్యేలు వ్యవహరిస్తారని జగన్ భయపడుతున్నారా? అని ఎద్దేవా చేశారు. ఇప్పటికే పెద్దాయన ఆత్మ.. సీఎం జగనుకి లేఖ రాశారని దుయ్యబట్టారు. రాజధానిపై తమ పాలసీ బహిరంగంగా ప్రకటించకుండా చీకట్లో జరిగే సమావేశాల్లో ప్రస్తావించడం దేనికి అని పలు పశ్నల వర్షం కురిపించారు.
అనంతరం అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై టీడీఎల్పీలో చర్చించారు. మూడు రాజధానుల విషయాన్ని గవర్నర్ ప్రసంగంలో ఎక్కడా ప్రస్తావించలేదన్న పయ్యావుల.. కేబినెట్ భేటీలో మాత్రం విశాఖకు వెళ్తామని సీఎం జగన్ చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించామని వివరించారు. సమస్యలపై వివిధ రూపాల్లో అసెంబ్లీ వేదికగా పోరాడతామని తేల్చి చెప్పారు.
అధికార పార్టీ ఫిర్యాదులతో టీడీపీ కార్యకర్తల మీద విచారణ లేకుండా కేసులు నమోదు చేశారని.. మాజీ శాసన సభ్యుడు యరపతినేని శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన ఈరోజు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం యరపతినేని మాట్లాడుతూ.. అధికార పార్టీ ఫిర్యాదులతో టీడీపీ కార్యకర్తల మీద విచారణ లేకుండా కేసులు నమోదు చేశారని ధ్వజమెత్తారు.
కొందరు పోలీసులు.. వైసీపీ కార్యకర్తల్లా పని చేస్తున్నారని, నాలుగు సంవత్సరాల వైసీపీ పరిపాలనలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేక, ప్రజల్లో వ్యతిరేకత తెచ్చుకున్నారని విమర్శించారు. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే తనకు చాలా ఇష్టమనీ.. ఇప్పటికైనా రాష్ట్ర పోలీసులు ప్రజల పట్ల, టీడీపీ కార్యకర్తల పట్ల వ్యవహరిస్తున్న తీరును మార్చుకోవాలంటూ హితవు పలికారు. వైసీపీ పార్టీ మీద, కాసు మహేష్ రెడ్డి మీద ఇంట్రెస్ట్ ఉంటే పోలీస్ యూనిఫాం వదిలి రావాలంటూ సవాల్ విసిరారు. ఆరిపోయిన దీపంలాంటి వైసీపీ ప్రభుత్వంలో.. తమ పార్టీ కార్యకర్తల ఒంటి మీద ఏ ఒక దెబ్బ పడ్డ, ఏ ఒక్క వ్యక్తిని వదిలిపెట్టమంటూ.. యరపతినేని శ్రీనివాసరావు హెచ్చరించారు.
ఇవీ చదవండి