AP High Court Key Questions on Ruling Party Leaders: ఉమ్మడి చిత్తూరు జిల్లా పుంగనూరు, అంగళ్లులో జరిగిన విధ్వంసక ఘటనపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం (హైకోర్టు) అధికార పార్టీ నాయకులపై ప్రశ్నల వర్షం కురిపించింది. ప్రతిపక్ష నేతకు వినతి ఇచ్చేందుకే అధికార పార్టీ నేతలు వెళ్లారా..? అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. ఫిర్యాదుదారు ‘అంగళ్లు’కు ఎందుకెళ్లాల్సి వచ్చింది..? అని ప్రశ్నించింది. ఈ చర్య రెచ్చగొట్టడం కాదా..? అని నిలదీసింది. చంద్రబాబు పర్యటన సందర్భంగా అధికార పార్టీకి చెందినవారు అంగళ్లులో నిరసన దీక్ష చేసేందుకు పోలీసుల అనుమతి ఉందా..? అని సూటీ ప్రశ్నలు వేసింది. పిటిషనర్లను అరెస్టు చేయవద్దంటూ.. పోలీసులకు సూచించాలని అదనపు ఏజీకి స్పష్టం చేసింది.
Mudivedu police cases against TDP workers.. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు 'సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి' పేరుతో ఈ నెల 1వ తేదీ నుంచి 10వ తేదీవరకూ పర్యటన చేపట్టిన విషయం తెలిసిందే. పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు.. చిత్తూరు జిల్లా పుంగనూరు, అన్నమయ్య జిల్లా అంగళ్లులో పర్యటించే సమయంలో అధికార పార్టీ నాయకులు చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు వాహనాలు అడ్డుపెట్టి విధ్వంసం సృష్టించారు. ఆ తర్వాత విధ్వంసానికి ప్రతిపక్ష నేత, టీడీపీ కార్యకర్తలే కారణమంటూ.. ముదివేడు పోలీసులు కేసులు నమోదు చేశారు. దీంతో టీడీపీ నేతలు అంగళ్లులో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి.. ముందుస్తు బెయిలు కోసం మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు, పీలేరు ఇంఛార్జి నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి, పులివర్తి నానిలు హైకోర్టులో పిటిషన్లు వేశారు.
SP Gangadhar Rao on CBN Case: చంద్రబాబు అకస్మాత్తుగా రూట్ మార్చుకున్నారు: ఎస్పీ గంగాధర్‌రావు
High Court direct questions on YCP leaders.. ఈ పిటిషన్లపై సోమవారం రోజున హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.సురేశ్ రెడ్డి విచారణ జరిపారు. విచారణలో భాగంగా అధికార పార్టీ నేతలపై ధర్మాసనం సూటీ ప్రశ్నలు వేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి అధికార పార్టీకి చెందిన నేతలు అంగళ్లులో వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లారని చెప్పడం వింతగా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఫిర్యాదుదారుడు, అతని అనుచరులు అంగళ్లుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది..?, మీ చర్య రెచ్చగొట్టడం కాదా..? అని ప్రశ్నించింది. చంద్రబాబు పర్యటన సందర్భంగా అధికార పార్టీకి చెందిన వారు అంగళ్లులో నిరసన దీక్ష చేసేందుకు పోలీసుల అనుమతి ఉందా..? అని ప్రశ్నించింది. అనంతరం వాదనల కొనసాగింపునకు విచారణను బుధవారానికి వాయిదా వేసింది. అప్పటి వరకు పిటిషనర్లను అరెస్టు చేయవద్దంటూ.. పోలీసులకు సూచించాలని అదనపు ఏజీకి స్పష్టం చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేశారు.
Arguments of advocate Posani Venkateswarlu.. హైకోర్టులో పిటిషనర్లు వేసిన వ్యాజ్యాలపై సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, పోలీసుల తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ముందుగా పిటిషనర్లు టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు, పీలేరు ఇంఛార్జి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి, పులివర్తి నానిల తరుఫు సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ.. ''ప్రాజెక్టును సందర్శించేందుకు చంద్రబాబు నాయుడు పోలీసుల నుంచి అనుమతి పొందారు. ఘటన చోటు చేసుకున్న నాలుగు రోజుల తర్వాత ఫిర్యాదు చేశారు. జాప్యానికి కారణాలేమిటో పేర్కొనలేదు. ఐపీసీ సెక్షన్ 307(హత్యాయత్నం), 115 వంటి తీవ్ర సెక్షన్లను ఉద్దేశపూర్వకంగా నమోదు చేశారు. సీఆర్‌పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసు ఇచ్చి వివరణ తీసుకోకుండా తప్పించుకునేందుకు పోలీసులు తీవ్ర సెక్షన్లు పెట్టారు. ప్రస్తుత ఘటనకు అ సెక్షన్లు వర్తించవు. ఫిర్యాదుదారుడికి ఎలాంటి గాయాలు తగలలేదు. ఈ వాదనలను ధర్మాసనం పరిగణలోకి తీసుకుని బెయిలు మంజూరు చేయాలని ధర్మసనాన్ని కోరుతున్నాను'' అని న్యాయవాది విజ్ఞప్తి చేశారు.
TDP Leaders Fire on CM Jagan : 'షేమ్ ఆన్ యూ జగన్ రెడ్డీ..' చర్యకు ప్రతి చర్య తప్పదని టీడీపీ హెచ్చరిక
Arguments of Additional AG Ponnavolu SudhakarReddy.. అనంతరం పోలీసుల తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ''పిటిషనర్ల ప్రేరేపణతో గొవడ జరిగింది. పోలీసులు అనుమతిచ్చిన మార్గంలో కాకుండా మరో దారిలో పర్యటన సాగింది. ప్రతిపక్ష నేత రెచ్చగొట్టారు.. దీంతో పిటిషనర్ల అనుచరులు దాడులకు దిగారు.'' అని వ్యాఖ్యానించగా.. ఆ వాదనలపై పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది అభ్యంతరం తెలిపారు. ప్రతిపక్ష నేత వ్యాజ్యంలో పిటిషనర్‌గా లేరని.. అలాంటప్పుడు వారిపై ఆరోపణ చేయడం సరికాదన్నారు. ఆ తర్వాత అదనపు ఏజీ వాదనలు కొనసాగిస్తూ.. గాయపడిన వారే ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదన్నారు. 47 మంది పోలీసులు గాయపడ్డారన్నారు. ఓ కానిస్టేబుల్ కంటిచూపు కోల్పోయారన్నారు. ప్రాజెక్టు వ్యవహారంలో ప్రతిపక్ష నేతకు వినతి ఇచ్చేందుకు అధికార పార్టీ నేతలు యత్నించారన్నారు. ఈ వాదన వింతగా ఉందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఏ1గా ఉన్న ప్రతిపక్ష నేతను అరెస్ట్ చేశారా? అని ప్రశ్నించగా.. ఈ ఘటనతో సంబంధం ఉన్నవారందర్ని అరెస్టు చేస్తామని ఏజీ బదులిచ్చారు. పూర్తి వాదనలు వినేందుకు తగిన సమయం లేకపోవడంతో విచారణను బుధవారానికి వాయిదా వేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు.
Adjournment of hearing on cases of TDP leaders.. మరోవైపు అంగళ్లు ఘటన నేపథ్యంలో ముదివేడు పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని, ఆ కేసు ఆధారంగా తమపై తొందరపాటు చర్యలు తీసుకోకుండా నిలువరించాలని కోరుతూ.. టీడీపీ నేతలు దాఖలు చేసిన వ్యాజ్యాలపై విచారణ బుధవారానికి వాయిదా పడింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్.రఘునందన్‌రావు సోమవారం ఈమేరకు ఉత్తర్వులిచ్చారు. తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ..టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు షాజహాన్ భాష, డి.రమేశ్, తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు, టీడీపీ నేత గంటా నరహరి హైకోర్టులో వ్యాజ్యాలు వేశారు. ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. ఈ వ్యాజ్యాల్లో అదనపు ఏజీ వచ్చి వాదనలు వినిపిస్తారని, వివరాలు తెప్పించుకునేందుకు కొంత సమయం ఇవ్వాలని కోరారు. అందుకు అంగీకరించిన న్యాయమూర్తి విచారణను బుధవారానికి వాయిదా వేశారు.