Anganwadis Chalo Vijayawada: సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. విజయవాడలో అడుగు పెట్టనివ్వకుండా.. వివిధ ప్రాంతాల్లో అంగన్వాడీలను పోలీసులు అడ్డుకున్నారు. వివిద మార్గాల్లో విజయవాడ వచ్చిన వారిని కూడా అరెస్టు చేసి.. స్టేషన్లకు తరలించారు. హక్కుల సాధన కోసం పోరాడుతున్న తమపై ప్రభుత్వం నిర్బంధకాండ ప్రదర్శించడం పట్ల అంగన్వాడి కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. విజయవాడ ధర్నాకు వచ్చిన అంగన్వాడీలను బస్టాండ్, రైల్వే స్టేషన్ల వద్ద పోలీసులు అరెస్టు చేసి.. ప్రైవేటు కల్యాణ మండపాలకు తరలించారు. పోలీసుల తీరుపై మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంగన్వాడీలను విజయవాడ రానివ్వకుండా.. పలుచోట్ల పోలీసులు అడ్డుకున్నారు. నందిగామలో అంగన్వాడీలను పోలీసులు అదుపులోకి తీసుకుని.. స్టేషన్‌కు తరలించారు.. ధర్నాకు వెళ్తున్న వారిని పెనుగంచిప్రోలులో అడ్డుకున్నారు. అంగన్వాడీలంతా స్టేషన్‌లోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. అంగన్వాడీల ఆందోళనలకు మద్దతుగా.. రాస్తారోకోకు సిద్ధమవుతున్న సీపీఎం నేతలను పోలీసులు నిర్భందించారు. బలవంతంగా ఈడ్చుకుంటూ వెళ్లి వ్యానుల్లో ఎక్కించారు. విజయవాడ వెళ్తున్న అంగన్వాడీలను.. మైలవరంలో పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుపై కూర్చుని నిరసన తెలుపుతున్న మహిళలను పోలీసులు బలవంతంగా వ్యాన్లలోకి ఎక్కించారు.
విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్‌ల వద్దకు భారీగా చేరుకున్న అంగన్వాడీలు.. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఆందోళనను హోరెత్తించారు. ప్రభుత్వ నిర్బంధాలను తప్పుపడుతూ విశాఖలో ఆందోళనకు దిగిన అంగన్వాడీలను పోలీసులు అరెస్టు చేసి.. బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించారు. శ్రీకాకుళం కలెక్టరేట్ ప్రధాన గేటు వద్ద నిరసన తెలిపిన అంగన్వాడీలను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల వాగ్వాదాలతో కాసేపు ఉద్రిక్తత తలెత్తింది.
ప్రకాశం జిల్లా గిద్దలూరులో అంగన్వాడీలు భారీ ర్యాలీ నిర్వహించారు. హామీల అమలు కోరుతూ అంగన్వాడీలు కర్నూలు కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. కడప కలెక్టరేట్ వద్దకు భారీగా చేరుకుని పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. అనంతపురం కలెక్టరేట్ వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేవల్లి వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి, మహాధర్నా నిర్వహించారు. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా... తమ హక్కుల పోరాటాన్ని ఆపలేదని.. అంగన్వాడీలు స్పష్టం చేశారు. హామీలు నెరవేర్చకపోతే... ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని అంగన్వాడీలు హెచ్చరించారు.