AP Cabinet Meeting : ముఖ్యమంత్రి జగన్ పుట్టిన రోజైన డిసెంబర్ 21వ తేదీన 5లక్షల ట్యాబ్‌లు పంపిణీ చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేయనున్నారు. జిందాల్ స్టీల్ భాగస్వామిగా కడప స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. రాష్ట్రంలో ఏపీ పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రమోషన్ పాలసీకి ఆమోదం తెలిపారు. భూముల రీసర్వే కోసం మున్సిపాలిటీల చట్ట సవరణకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది.
బాపట్ల, పల్నాడు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. 1,301 చదరపు కిలీమీటర్ల విస్తీర్ణంలో 2 మున్సిపాలిటీలు, 101 గ్రామాలతో బాడా ఏర్పాటు చేయనున్నారు. అలాగే 7 వేల 281 చదరపు కిలోమీటర్ల పరిధితో పల్నాడు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ జరగనుంది. 8మున్సిపాలిటీలు, 349 గ్రామాలతో పల్నాడు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు చేయనున్నారు. కొత్తగా ఏర్పాటు కానున్న ఏపీ జ్యుడీషియల్ అకాడమీలో 55 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు. కొత్త జిల్లాల్లో వైసీపీ కార్యాలయాల నిర్మాణానికి స్థలాల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం లభించింది. హెల్త్ హబ్స్ ఏర్పాటుకు కొత్త విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తితిదేలో కొన్ని శాఖలకు ప్రచారం కోసం చీఫ్ పీఆర్‌వో పోస్టు భర్తీకి ఆమోదం తెలిపారు.
ఇవీ చదవండి: