AP JAC Amaravati Leaders Meet with CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో ఏపీ జేఏసీ, ఇతర ఉద్యోగ సంఘాల నాయకులు ఈరోజు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. సమావేశంలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను స్వాగతిస్తున్నామని.. కేబినెట్ నిర్ణయాలపై, జీపీఎస్‌పై ఉద్యోగ సంఘాల నేతలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నామని సీఎం జగన్‌కు తెలిపారు. అనంతరం సీఎంకు పుష్పగుచ్చాన్ని అందజేసి, శాలువతో సత్కరించారు.
47 అంశాలు రాసిస్తే.. 36 అంశాలను పరిష్కరిస్తామన్నారు.. ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ.. భవిష్యత్తులో జీపీఎస్ అనేది దేశానికి రోల్ మోడల్ అవుతుందని, ఉద్యోగులకు ఎంతో మేలు చేస్తుందని.. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉద్యోగ సంఘాల నేతలకు తెలిపారని ఆయన అన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఏపీ జేఏసీ మద్దతును ప్రకటిస్తుందని బొప్పరాజు వ్యాఖ్యానించారు. పాత పింఛన్ విధానానికి 80శాతం దగ్గరగా జీపీఎస్ తీసుకురావటం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నామన్నారు. ఏపీ జేఏసీ సంఘం తరుపున 47 అంశాలు పరిష్కరించాలని సీఎస్‌కు లేఖ ఇస్తే.. 36 అంశాల పరిష్కారానికి చర్యలు తీసుకున్నారని వివరించారు. ఈరోజు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ని కలిసి ఏపీజేఎసీ అమరావతి నేతలు ధన్యవాదాలు తెలియజేశామన్నారు. ఒప్పంద కార్మికులను క్రమబద్దీకరించడంతో పాటు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారని బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు.
ఉద్యోగులు బాగుంటే-ప్రజలు బాగుంటారు.. రాష్ట్రంలో ఉద్యోగులు సంతోషంగా ఉంటేనే డెలివరీ మెకానిజం బాగుంటుందని, తద్వారా ప్రజలు కూడా సంతోషంగా ఉంటారని, ఉద్యోగుల్ని సంతోషంగా ఉంచడానికి తమ ప్రభుత్వం ప్రతి కార్యక్రమం మనసా, వాచా కర్మేణా చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారని.. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ విభాగాల్లో మిగిలిపోయిన కాంట్రాక్టు ఉద్యోగులను సర్వీసుల క్రమబద్దీకరణకు సీఎం చర్యలు తీసుకుంటారని వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు.
అవును ఆ మాట వాస్తవమే..?.. అనంతరం అర్హత, సర్వీసును ఆధారంగా వీలైనంత ఎక్కువ మంది కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్దీకరిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారని.. ఇచ్చిన మాట ప్రకారమే.. అర్హత ఉన్న కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబదీకరించారని..వెంకట్రామిరెడ్డి వెల్లడించారు. బదిలీల్లో కొన్ని విభాగాల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమేనన్న వెంకట్రామిరెడ్డి.. ఎఎన్‌ఎంలు, హార్టికల్చర్ సిబ్బంది కూడా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇబ్బందులు పడకుండా అందరికీ బదిలీ జరిగేలా ప్రభుత్వంతో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు.