Amrit Bharat Express: దేశంలో సరికొత్త కేటగిరీ రైళ్లు పట్టాలెక్కాయి. సామాన్య ప్రజల కోసం 'అమృత్ భారత్' పేరిట మరో నూతన రైలును కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. మొత్తం నాన్ ఏసీ బోగీలతో నడిచే ఈ రైలులో ప్రయాణికులకు సౌకర్యాలు చూడముచ్చటగా ఉన్నాయి. దేశంలో రెండు రైళ్లు పట్టాలెక్కగా ఒకటి దక్షిణాదికి కేటాయించారు. ఏపీ ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉండేలా నడుపుతున్నారు.
ఉన్నత శ్రేణి ప్రయాణికులకోసం వందే 'భారత్ రైళ్లు'ను ప్రవేశపెట్టిన రైల్వేశాఖ సామాన్య ప్రయాణికుల కోసం 'అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్' రైళ్లు పట్టాలెక్కించింది. గతేడాది డిసెంబర్ 3న ప్రధాని మోదీ 2 'అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్' రైళ్లను ప్రారంభించగా ఒకటి ఉత్తరాదికి, మరొకటి దక్షిణాదికి కేటాయించారు. దక్షిణాదిన పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా నుంచి కర్ణాటకలోని బెంగళూరు మధ్య ఏపీ మీదుగా ప్రయాణిస్తోంది. ప్రత్యేక సదుపాయాలతో ఏర్పాటు చేసిన ఈ రైలెక్కిన వారంతా అదుర్స్ అంటున్నారు.
జగనన్నా ఇదేనా నీ చిత్తశుద్ధి - ఎన్నికల ముందు విశాఖ మెట్రో అంటూ ఎందుకీ హడావుడి?
భారతీయ రైల్వే ప్రవేశపెట్టిన సరికొత్త రైలు 'అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్'కు ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువ స్టాపులు కేటాయించారు. మాల్దా నుంచి బెంగళూరు మధ్య మొత్తం 32 స్టాపులు ఉండగా ఆంధ్రప్రదేశ్‌లోనే 14 స్టేషన్లలో ఆగుతోంది. శ్రీకాకుళం, విజయనగరం విశాఖపట్నం, తుని, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా బెంగళూరుకు రాకపోకలు సాగిస్తోంది. 'పుష్'- 'పుల్' రెండు ఇంజిన్లూ(Push and Pull Engines) ఉండటం ఈ రైళ్ల ప్రత్యేకత.
ముందూ, వెనుకా ఉండే ఈ ఇంజిన్ల కారణంగా తక్కువ సమయంలోనే రైలు వేగాన్ని అందుకుంటుంది. గరిష్టంగా 130 కిలోమీటర్ల వేగంతో పట్టాలపై పరుగులు తీస్తుంది. వంపు మార్గాలు, వంతెనలపైనా కుదుపుల్లేకుండా సాఫీగా ప్రయాణంసాగేలా అధునాతన బోగీలు అమర్చారు. ఈ రైళ్లలో మొత్తం 22 కోచ్‌లు ఉండగా 12 సెకండ్ క్లాస్ త్రీటైర్ స్లీపర్లు, 8 జనరల్, 2 గార్డు కంపార్ట్‌మెంట్లు ఉంటాయి. స్లీపర్ బోగీని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.
సామాన్య ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించేలా జనరల్ బోగీలు ఏర్పాటు చేశారు. తొలిసారిగా 'అమృత భారత్' రైళ్లలో, సాధారణ తరగతిలో మొబైల్ ఛార్జర్‌కు పాయింట్లు ఇచ్చారు. ఛార్జింగ్ సమయంలో మొబైల్ ఉంచడానికి స్టాండ్‌లు సైతం ఏర్పాటు చేశారు. 'అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్'ను నాన్ ఏసీ స్లీపర్(Non AC Sleeper) కమ్ అన్‌రిజర్వ్‌డ్ క్లాస్(Unreserved Class) సర్వీస్‌గా పట్టాలెక్కించారు. తక్కువ ఖర్చుతో, ఎక్కువ దూరాలకు సత్వరం చేరేలా రూపొందించారు. దశల వారీగా అన్ని ప్రాంతాలకు ఈ రైళ్లను విస్తరించాలని రైల్వేశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
రెండు నెలలుగా నిలిచిపోయిన గుంటూరు- కాచిగూడ రైలు - ప్రయాణికుల అవస్థలు