Amaravati farmers petition in the Supreme Court: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని భూముల విషయంలో ప్రభుత్వానికి, రైతుల మధ్య సరైన సంధి కుదరటం లేదు. ఆర్-5 జోన్ విషయంలో ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌పై అమరావతి రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆర్-5 జోన్ వ్యవహారంపై దేశ అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు)లో రైతులు పిటిషన్ వేశారు. రైతులు వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ధర్మాసనం ఎదుట సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు. ఈ క్రమంలో సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడి అభ్యర్థనను పరిశీలించిన ధర్మాసనం.. ఏప్రిల్ 14వ తేదీన విచారణ చేపడతామని తెలియజేసింది.
మార్చి 21న గెజిట్ : వివరాల్లోకి వెళ్తే..వైసీపీ ప్రభుత్వం మార్చి నెల 21వ తేదీన ఆర్-5 జోన్ ఏర్పాటు చేస్తూ.. గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఆ నోటిఫికేషన్‌లో.. 900 ఎకరాల భూములను ఆర్-5 జోన్ పరిధిలోకి తెచ్చినట్లు పేర్కొంది. అంతేకాకుండా, అమరావతిలో స్థానికేతరులకు ఇళ్ల స్థలాలను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దమైందని గెజిట్ నోటిఫికేషన్‌లో తెలిపింది. దీంతోపాటు విజయవాడ, గుంటూరు నగరాలకు చెందిన పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రత్యేక జోన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలు, మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు గ్రామాల పరిధిలో ఉన్న 900.97 ఎకరాల మేర పేదల ఇళ్ల కోసం జోనింగ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఎంపిక చేసిన భూముల ప్రాంతాన్ని ఆర్-5 జోన్‌గా పేర్కొంటూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది.
ప్రభుత్వం తీరుపై రాజధాని రైతుల ఆగ్రహం: ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అమరావతి భూముల విషయంలో విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌పై రైతులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆర్- 5 జోన్ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం తీరును ఖండిస్తూ రాజధాని రైతులు న్యాయ పోరాటానికి ముందడుగు వేశారు. అమరావతి భూముల విషయంలో ఇప్పటికే రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చిన కూడా న్యాయస్థానం తీర్పునకు వ్యతిరేకంగా ప్రభుత్వం గెజిట్ విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ.. సుప్రీంకోర్టులో రాజధాని కేసుల విచారణ సందర్భంగా ప్రస్తావిస్తామని పేర్కొన్నారు. రాజధాని భూముల విషయంలో గ్రామ సభల్లో ప్రజాభిప్రాయాన్ని గౌరవించకుండా, రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని రైతులు మండిపడ్డారు.
సుప్రీంకోర్టులో రైతులు పిటిషన్: రాజధాని భూముల విషయంలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై అమరావతి రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించి.. న్యాయస్థానంలో పిటివేషన్ వేశారు. రైతుల పిటిషన్‌పై సీజేఐ ధర్మాసనం ముందు రైతుల తరఫు న్యాయవాది ప్రత్యేక వాదనలు వినిపించారు. 10న విచారణకు తీసుకోవాలని రైతుల తరఫున న్యాయవాది ధర్మసనాన్ని కోరారు. దానికి ఆరోజు కేసుల జాబితా ఇప్పటికే తయారైందని, ఈనెల 10న విచారించాల్సిన కేసులు చాలా ఉన్నాయని.. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. అనంతరం ఈ పిటిషన్‌ను ఏప్రిల్ 14వ తేదీన విచారణకు తీసుకుంటామని తెలియజేస్తూ.. విచారణను వాయిదా వేశారు.
ఇవీ చదవండి