Agriculture Students Farming: దేశానికి తిండి పెట్టే వ్యవసాయ రంగాన్నే ఉపాధి మార్గంగా మార్చుకుని.. ఆ రంగం అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు ఈ విద్యార్థులు. కళాశాల ఆధ్వర్యంలో కూరగాయలు, వరి సాగు, కోళ్ల పెంపకం చేస్తూ వ్యవసాయంపై పట్టుసాధిస్తున్నారు. ఈ సాగు ద్వారా వచ్చిన ఆదాయంతో కొత్త మెలకువలు నేర్చుకుంటున్నారు ఈ యువత. వీరంతా విజయవాడలోని ఆంధ్రా లయోల కళాశాల చెందిన విద్యార్థులు. వ్యవసాయంపై ఆసక్తి.. రైతన్నకు బాసటగా నిలవాలనే సదుద్దేశ్యంతో అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ కోర్సులో చేరారు రెండు తెలుగు రాష్ట్రాల యువత. కళాశాల ఇచ్చిన ప్రోత్సాహంతో చేనుబాట పట్టారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో రైతు పడే కష్టాలను విద్యార్థి దశ నుంచి అవగాహన చేసుకుంటున్నారు.
అధ్యాపకుల మార్గనిర్దేశంలో నూతన ఆలోచనలకు శ్రీకారం చుడుతూ.. రైతన్నకు చేదుడుగా ఉండేందుకు సమాయత్తమయ్యారు ఈ విద్యార్థులు. కళాశాలలో చేరిన మొదటి ఏడాది నుంచే వ్యవసాయ ఆధారిత పంటలు, సాగులు, దిగుబడి, రాబడి, లాభనష్టాలు, సమాజహిత పంటలు, ఆర్గానిక్ పంటల సాగుబడితో పాటుగా ఆక్వా, పౌల్ట్రీ పరిశ్రమలపైన దృష్టి పెట్టారు.
సేంద్రీయ వ్యవసాయంలో భాగంగా చిరుధాన్యాలు, అరటి, మొక్కజొన్న, వరి, మినుములు, పెసలు, కంది వంటి.. పంటలను అందుబాటులో ఉన్న విస్తీర్ణంలో పడిస్తున్నారు. మండువేసవిలోనూ కూరగాయలను విభిన్నపద్ధతుల్లో పండించేందుకు అనువుగా పాలీహౌస్‌ను ఏర్పాటు చేసుకున్నారు. కోళ్ల పెంపకంలో అరుదైన కడక్‌నాద్ కోళ్లు, గిన్నె కోళ్లు, నాటుకోళ్లను పెంచుతున్నారు.
వ్యవసాయంలో నూతన పద్ధతులు, ఇతర దేశాల్లో రాణిస్తున్న విధానాలను అవగతం చేసుకుంటూ పరిశీలనాత్మకంగా సాగు చేస్తున్నారు. అలాగే మొక్కలను పీడించే తెగుళ్లు, పురుగులను ఎలా నివారించాలో ప్రయోగాల రూపంలో చేస్తూ నైపుణ్యం సాధిస్తున్నారు. కూరగాయలను, ఇతర పంటలు, గుడ్లను విక్రయిస్తున్నారు. అలాగే ప్రత్యేకమైన ఏర్పాటు చేసిన కుండీల్లో చేపలను పెంచి అమ్ముతున్నారు. వచ్చిన డబ్బులతో కొత్త మెలకువలు నేర్చుకోవడానికి ఖర్చుచేస్తున్నారు.
కళాశాలలో చదువులు, వ్యవసాయ క్షేత్రంలో పంటలు, ప్రతీ సెమిస్టర్ తర్వాత రైతులతో సమావేశ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఈ విద్యార్థులు. తద్వారా ప్రతిభ, నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకుంటున్నారు. తమకు తెలియని అనేక విషయాలను రైతుల నుంచి నేరుగా తెలుసుకుంటున్నామని.. మరికొన్ని విషయాల్లో రైతులకు సలహాలు, సూచనలు ఇస్తున్నామని విద్యార్థులు చెబుతున్నారు.
రసాయన ఎరువులకు ప్రత్యమ్నాయంగా సేంద్రియ ఎరువులను తయారు చేస్తున్నారు ఈ విద్యార్థులు. రైతులు కూడా సేంద్రీయ ఎరువుల వినియోగంపై దృష్టి సారిస్తే ఆరోగ్యంతో పాటు ఆర్థికంగానూ మంచి లాభాలు సంపాదించవచ్చని అంటున్నారు. తమ కాలేజీలో చదువుకునే ప్రతీ విద్యార్థి ఉపాధి పొందేటట్లు తయారు చేస్తున్నామని అధ్యాపకులు చెబుతున్నారు. తరగతి గదిలో అధ్యాపకులు చెప్పిన విషయాలను వ్యవసాయ క్షేత్రంలో ప్రాక్టీకల్‌గా చేస్తున్నారు ఈ విద్యార్థులు. నేర్చుకున్న శాస్త్రీయ పద్ధతులను రైతులకు వివరిస్తున్నారు. అలాగే భవిష్యత్తులో వ్యవసాయ రంగం, దాని అనుబంధ రంగాల్లో స్థిరపడి రైతులకు అండగా ఉంటామని విద్యార్థులు చెబుతున్నారు. సరైన పద్ధతుల్లో వ్యవసాయం చేస్తే మంచి లాభాలు సంపాదించవచ్చని అభిప్రాయ పడుతున్నారు.