Adivasi Intellectuals Meeting : బోయ, వాల్మీకి, బెంతు, ఒరియా కులాలను ఎస్టీ జాబితాలో చేరుస్తూ వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలని ఆదివాసి గిరిజన సంఘాల ప్రతినిధులు తీర్మానించారు. అసెంబ్లీ సాక్షిగా ఆదివాసీలకు వైసీపీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన సంఘాల ఆధ్వర్యంలో విజయవాడలో ఆదివాసి మేధావుల సమావేశం నిర్వహించగా.. ఈ సమావేశంలో గిరిజన సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదివాసీ మేధావుల వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు అనుముల వంశీకృష్ణ మాట్లాడుతూ.. సుమారు 60 లక్షల మంది ఉన్న వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలో చేరిస్తే గిరిజనులు తమ హక్కులను కోల్పోయే ప్రమాదం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
వైసీపీ ప్రభుత్వ చేసిన తీర్మానానికి వ్యతిరేకంగా ఏప్రిల్ 24వ తేదీన చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చినట్లు తెలిపారు. అసెంబ్లీలో తీర్మానం చేస్తున్నప్పుడు సభలోనే ఉండి కనీసం ఖండించకుండా, నోరు మెదపకుండా ఉన్న ఎస్టీ ఎమ్మెల్యేలు ఆదివాసులకు క్షమాపణ చెప్పాలని కోరారు. వారి ఇళ్లను సైతం ముట్టడిస్తామని హెచ్చరించారు. తక్షణమే వైసీపీ ఎస్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని అన్నారు. రాజీనామా మాత్రమే కాకుండా ఉద్యమంలోకి రావాలని పిలుపునిచ్చారు. గిరిజనులు మనోభావాలను అర్థం చేసుకోకుండా.. ర్యాలీలు, ధర్నాలు, ముట్టడీల వంటి ఆందోళన కార్యక్రమాలను చేపట్టిన.. ఆలోచించకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని అన్నారు. శాసనసభ సమావేశాలు జరుగుతున్న సమయంలో నిండు అసెంబ్లీలో ఎస్టీ జాబితాలో చేరుస్తున్నామని సీఎం జగన్మోహన్ రెడ్డి నిండు అసెంబ్లీలో ప్రకటించారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.
ఇప్పటికే సామాజిక, ఆర్థిక, రాజకీయాలలో వెనకబడి ఉన్నామని పేర్కొన్నారు. గిరిజనులు ఎన్ని బాధలకు గురవుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. గిరిజనులు కోసం ప్రత్యేకంగా కేటాయించిన నిధులను.. గిరిజనులో కోసం ఖర్చు పెట్టకుండా, ఇతర ప్రభుత్వ పథకాలకు మళ్లీంచరాని ఆరోపించారు. ఇలా చేసిన ముఖ్యమంత్రి గిరిజనులకు క్షమాపణ చెప్పలాని వారు డిమాండ్ చేశారు. దారి మళ్లీంచిన నిధులను తిరిగి గిరిజన సంక్షేమ శాఖకు కేటాయించాలని.. గిరిజన అభివృద్ధికి కేటాయించాలన్నారు. ప్రభుత్వం చేసిన తీర్మానానికి ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. గిరిజనులలో ఉన్న అన్ని తెగల ప్రజలు, పార్టీల అతీతంగా ఈ తీర్మానాన్ని ఖండిస్తున్నామని వివరించారు. కేంద్రం అనుమతులు ఇవ్వకుండా ఉండేందుకు తాము పోరాటం చేయనున్నట్లు వెల్లడించారు.
ఇవీ చదవండి :