VIJAYAWADA BOOK FAIR : గత మూడు దశాబ్దాలకు పైగా దిగ్విజయంగా సాగుతున్న విజయవాడ పుస్తకమహోత్సవం నేటి నుంచి ఆరంభం కాబోతోంది. నేటి నుంచి 19 వరకు విజయవాడ నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో ప్రదర్శన జరగబోతోంది. 33వ పుస్తక మహోత్సవాన్ని సాయంత్రం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రారంభించనున్నారు. వీబీఎఫ్‌ఎస్ అంకితభావం, పట్టుదల, స్థానిక అధికారులు, నాయకుల సహకారం, ప్రజల ఆదరణతో నిర్విరామంగా మూడు దశాబ్దాలకు పైగా పుస్తక ప్రదర్శన కొనసాగుతోంది.
ఏటా పుస్తక మహోత్సవం జరిగే స్వరాజ్య మైదానంలో అంబేడ్కర్ స్మృతివనం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో ప్రదర్శనకు సరైన స్థలం దొరకక.. జాప్యం జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్, చెన్నై పుస్తక మహోత్సవాల సమయంలో కాకుండా.. అవి అయ్యాక పెట్టాలని నిర్ణయించారు. ఒకే సమయంలో పెడితే.. పుస్తక విక్రేతలు, ప్రచురణ సంస్థలకు ఇబ్బంది అవుతుంది. మళ్లీ వచ్చే ఏడాది నుంచి సంక్రాంతికి ముందు జనవరిలోనే పుస్తక మహోత్సవం ఏర్పాటు చేస్తామని వీబీఎఫ్‌ఎస్ గౌరవాధ్యక్షులు బెల్లపు బాబ్జి వెల్లడించారు.
నేషనల్ బుక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తొలిసారి 1989 అక్టోబరులో మొదటి విజయవాడ పుస్తక మహోత్సవం జరిగింది. అప్పటి నుంచి ఏటా విజయవాడలో పుస్తకమహోత్సవం నిర్వహించాలని సంకల్పించారు. నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రోత్సాహంతో.. విజయవాడలోని ప్రచురణ కర్తలు, సాహితీ వేత్తలు, కవులు, రచయితలు అంతా కలిసి విజయవాడ పుస్తక మహోత్సవ సంఘం(వీబీఎఫ్‌ఎస్)గా ఏర్పడ్డారు. 1991 నుంచి ఏటా జనవరిలో పుస్తక మహోత్సవం నిర్వహించడం ఆరంభించారు.
తొలి ఏడాది 1989లో 84 స్టాళ్లతో నిర్వహించగా, 1991లో 90కు పెరిగాయి. అప్పుడు విజయవాడ జనాభా 5లక్షలుండగా, పుస్తక మహోత్సవానికి వచ్చిన సందర్శకుల సంఖ్య లక్ష వరకూ ఉండేది. 2015లో నిర్వహించిన 26వ పుస్తక మహోత్సవంలో అత్యధికంగా 389 స్టాళ్లను పెట్టి రికార్డు సృష్టించారు. ఈ ఏడాది 200 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఏటా కనీసం ఐదు లక్షల మందికి పైగా పాఠక ప్రియులు తరలివచ్చి ఇక్కడ పుస్తకాలను కొనుగోలు చేస్తుంటారు.
ప్రముఖుల గౌరవార్థం..
విజయవాడకు విమానసౌకర్యం లేని రోజుల్లోనే కుష్వంత్ సింగ్, ఆర్కే లక్ష్మణ్, రొమిల్లా థాపర్ వంటి జాతీయ సాహితీ వేత్తలను ఇక్కడికి రప్పించారు. ఆరుద్ర, సి.నారాయణరెడ్డి, రావూరి భరద్వాజ, కాళీపట్నం రామారావు, మధురాంతకాం రాజారాం, బాపు రమణలు ఇలా తెలుగు సాహిత్యానికి వన్నెలద్దిన రచయితలంతా ఇక్కడికి తరచుగా వచ్చి వెళ్లేవారు. ప్రచురణకర్తలు సొంతంగా ఏర్పాటు చేసుకొనే పుస్తకావిష్కరణ సభలూ, వాటికి హాజరయ్యే రచయితలూ, కవులూ అనేకమంది ఉండేవారు. ఈసారి సాహిత్య వేదికకు గొల్లపూడి మారుతీరావు, ప్రతిభ వేదికకు సత్యజిత్‌రే, పుస్తక మహోత్సవ ప్రాంగణానికి విక్రమ్ పబ్లిషర్స్ అధినేత ఆర్.రామస్వామి పేర్లను పెట్టారు.
13న పాదయాత్ర..
ఈ ఏడాది పుస్తక ప్రియుల పాదయాత్రను ఫిబ్రవరి 13న నిర్వహిస్తున్నారు. విజయవాడలోని సిద్థార్థ ఆర్ట్స్ కళాశాల నుంచి ఆరంభించి.. ప్రదర్శన జరిగే పాలిటెక్నిక్ కళాశాల వరకూ ఈ పాదయాత్ర జరుగుతుందని విజయవాడ పుస్తక మహోత్సవ సంఘం సమన్వయకర్త ఎమెస్కో విజయకుమార్, గౌరవాధ్యక్షులు బెల్లపు బాబ్జీ, అధ్యక్షులు మనోహరనాయుడు, కార్యదర్శి కె.లక్ష్మయ్య వెల్లడించారు.
200 స్టాళ్లు.. లక్షల పుస్తకాలు..
పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో ఈసారి 200 పుస్తకాల స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్టాళ్లలో కెజి నుంచి పీజీ వరకూ పుస్తకాలు అందుబాటులో ఉంచుతున్నారు. పిల్లలకు సంబంధించిన పుస్తకాలు అధికంగా ఉండబోతున్నాయి. భారతం, రామాయణం, భగవద్గీత, కథల పుస్తకాలు, పంచతంత్రం సహా అన్నీ ఉంటాయి. తెలుగు, ఆంగ్ల నవలలు, ఇంజినీరింగ్, మెడికల్ పుస్తకాలు, ఆధ్యాత్మిక పుస్తకాలు సహా అన్ని రకాలూ అందుబాటులో ఉంటాయి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పుస్తక విక్రేతలు, ప్రచురణ కర్తలు తరలివచ్చి స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు.
ఇవీ చదవండి: