TDP SPECIAL PROGRAM FOR LOKESH 100days Padayatra: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ ఏడాది జనవరి 27వ తేదీన 'యువగళం' పేరుతో చిత్తూరు జిల్లా నుంచి పాదయాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. యువగళం పాదయాత్ర మొదలైన రోజు నుంచి ఈరోజు దాకా అనేక అడ్డంకులను, పోలీసుల ఆంక్షలను అధిగమిస్తూ.. 100వ రోజుకు చేరుకోబోతుంది. ఈ క్రమంలో ఈ నెల 15వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో సంఘీభావంగా పాదయాత్రలు చేపట్టాలని పార్టీ అధిష్ఠానం శ్రేణులకు పిలుపునిచ్చింది. యువగళం పాదయాత్ర వంద రోజుల వేడుకను ఘనంగా నిర్వహించాలని సన్నాహాలు చేస్తోంది. 175 నియోజకవర్గాల నుంచి అభినందనలు తెలిపేలా ప్రత్యేక కార్యాచరణను తయారుచేస్తోంది. ప్రతి నియోజకవర్గంలో 3 వేల మంది పార్టీ శ్రేణులతో 7 కి.మీ పాదయాత్రను చేపట్టేలా నిర్ణయం తీసుకుంది.
యువగళం పాదయాత్ర 100వ రోజు వేడుకలు.. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 100వ రోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 175 నియోజకవర్గాల నుంచి అభినందనలు తెలిపేలా ఓ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఈ నెల 15వ తేదీన 100 రోజుల మైలురాయిని యువగళం పాదయాత్ర చేరుకోనుంది. అదే రోజున పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో సంఘీభావంగా పాదయాత్రలు నిర్వహించాలని అధిష్ఠానం నిర్ణయించింది. దీంతోపాటు 3 వేల మంది పార్టీ కార్యకర్తలతో ప్రతి నియోజకవర్గంలో దాదాపు 7 కిలో మీటర్ల పాదయాత్రలను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ పాదయాత్రలను పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు వారి వారి నియోజకవర్గాలలో జరిగే పాదయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది.
యువగళం 96వ రోజు పాదయాత్ర పూర్తి.. ఇక, యువగళం నేటి పాదయాత్ర విషయానికొస్తే.. నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు నియోజకవర్గం ఈరోజు యువగళం 96వ రోజు పాదయాత్రను నారా లోకేశ్ నుంచి ప్రారంభించారు. పాదయాత్రలో భాగంగా ఆయన.. తర్తూరు, మండ్లెం, తంగడంచ మీదుగా జూపాడుబంగ్లా, తరిగోపుల మీదుగా బన్నూరు వరకు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా నారా లోకేశ్.. జగన్ విధ్వంసక పాలనకు.. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని తంగెడంచలో నిలచిపోయిన జైన్ ఇరిగేషన్ ప్రాజెక్టే సజీవ సాక్షి.. అంటూ సెల్ఫీ విడుదల చేశారు. రైతులకు అధునాతన వ్యవసాయ పరికరాలు అందించడంతోపాటు కరవు సీమలో.. యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో చంద్రబాబు ఆహ్వానం మేరకు అప్పట్లో స్వర్గీయ భవర్ లాల్ జైన్ తంగెడంచలో ప్రాజెక్టు ఏర్పాటుకు ముందుకు వచ్చారని గుర్తు చేశారు.
ఆ ప్రాజెక్ట్ కోసం 623 ఎకరాల భూమిని గత ప్రభుత్వం కేటాయించినట్లు లోకేశ్ వివరించారు. అనుకున్న ప్రకారం ప్రాజెక్టు పూర్తయి ఉంటే రైతాంగం జీవన స్థితిగతులు మారిపోయేవని అన్నారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ సహకారం అందించకపోవడంతో జైన్ ప్రాజెక్టు ఇలా అర్ధాంతరంగా నిలచిపోయిందని దుయ్యబట్టారు. సైకో సీఎం వికృత పాలనకు.. ఇదొక ఉదాహరణ మాత్రమే అని ధ్వజమెత్తారు.
బీసీలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాం.. అనంతరం టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే.. బీసీలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని నారా లోకేష్ హామీ ఇచ్చారు. నందికొట్కూరు నియోజకవర్గంలోని తంగడంచ వద్ద బీసీ సామాజిక వర్గం ప్రతినిధులతో ఆయన ముఖాముఖి సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం నారా లోకేష్ మాట్లాడుతూ.. ''జగన్ పాలనలో కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారు. ఒక్కరికీ రుణం ఇవ్వలేదు. రూ. 270 కోట్లు యాదవ సామాజిక వర్గానికి ఖర్చు చేసింది ఒక్క టీడీపీనే. గోపాల మిత్ర వ్యవస్థను జగన్ నిర్వీర్యం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గొర్రెలు, పశువులు కొనడానికి సబ్సిడీ రుణాలు అందిస్తాం. మందులు, దాణా, మేత, ఇన్స్యూరెన్స్ కల్పిస్తాం. గొర్రెలు పెంపకం కోసం బంజరు భూములు కూడా కేటాయిస్తాం. జిఓ నంబరు 217 రద్దు చేసి, మత్స్యకారులకు చెరువులు అప్పగిస్తాం.'' అని ఆయన అన్నారు.
ఇవీ చదవండి