Nandigama Government Hospital: రాజకీయ నాయకులు ఇచ్చే హామీలు.. నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయనే దానికి నిదర్శనం ఎన్టీఆర్ జిల్లా నందిగామ ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి. 100 పడకల ఆసుపత్రిగా మారుస్తామని.. ఎన్నికల ముందు హామీలిచ్చిన నేతలు.. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా దాన్ని పట్టించుకునే వారే లేరు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని కూడా విజయవాడ, గుంటూరు తీసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ నిర్వహణలో నడుస్తున్న దేవినేని వెంకటరమణ సామాజిక ఆరోగ్య కేంద్రం దగ్గర్లోనే ఉన్నా.. సౌకర్యాల కొరత వల్ల ప్రజలకు నిరుపయోగంగా మారింది. చుట్టు పక్కల గ్రామాల నుంచి నిత్యం వందలాది మంది రోగులు ఇక్కడికి వస్తుంంటారు. కానీ, ఇక్కడ సరైన వైద్యం అందకపోవడంతో వారు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. వారిని ఈ ఆసుపత్రికి తరలిస్తే.. వైద్యులు, పరికరాలు లేక ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం విజయవాడ, గుంటూరు ఆసుపత్రులకు పంపిస్తున్నారు. ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలించేటప్పుడు చాలా మంది ప్రాణాలు కోల్పోయారంటూ.. స్థానికులు చెబుతున్నారు.
నాలుగు మండలాల నుంచి నిత్యం వందలాది మంది రోగులు నందిగామ ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి వస్తుంటారు. ప్రస్తుతం ఈ ఆసుపత్రిలో ఇద్దరు గైనకాలజిస్టులు, ఒక E.N.T. వైద్యుడు, ఓ ఆప్తమాలజిస్ట్, ఒక జనరల్ సర్జన్ ఉన్నారు. పిల్లల వైద్యుడితోపాటు, జనరల్ మెడిసిన్ డాక్టర్ పోస్టు ఖాళీగా ఉంది. అన్ని రకాల వైద్యులు లేకపోవడంతో ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రికి వస్తున్న రోగులు.. నానా అవస్థలు పడుతున్నారు.
ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకునే.. స్తోమత లేక ఇక్కడికి వస్తే.. ఇక్కడ సరైన సౌకర్యాలు లేవంటూ డాక్టర్లు చెబుతున్నారని స్థానికులు వాపోతున్నారు. వైద్య పరికరాలు, ఔషదాలు అందుబాటులో లేకపోతే తమకు మంచి వైద్యం ఎలా అందుతుందని రోగులు, వారి సహాయకులు ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా నందిగామ ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చిన వారంతా పేద ప్రజలు.. ఆర్థికంగా వెకబడిన వారే. తమకు మెరుగైన వైద్యం అందుబాటులోకి తీసుకురావాలంటే ఈ ఆసుపత్రిని 100పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని ఇక్కడి స్థానికులు, రోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
ఇవీ చదవండి