Fraud in the name of schemes: స్కీముల పేరుతో బహుమతులు ఎరవేసి ఎన్నో సంస్థలు అమాయకులను బురిడీ కొట్టిస్తున్నాయి. ఇదే తరహాలో మరో సంస్థ కూడా పేద మహిళల ఆర్థిక అవసరాలే పెట్టుబడిగా మోసానికి పాల్పడింది. నంద్యాల జిల్లాలో మహిళలకు తీయటి మాటలు చెప్పి నగదు వసూలు చేసి బోర్డు తిప్పేసింది.
తక్కువ వడ్డీకే అప్పు ఇస్తాం. నెల నెలా 2,500 రూపాయలు చెల్లించండి సరిపోతుంది... అంటూ గుంటూరుకు చెందిన ఇద్దరు వ్యక్తులు నంద్యాల జిల్లా డోన్ పట్టణానికి వచ్చారు. పది మంది మహిళలను ఒక గ్రూపుగా ఏర్పాటు చేశారు. పట్టణంలో ఒకే కాలనీలో 60 మంది మహిళలతో 6 గ్రూపులు ఏర్పాటు చేశారు. ప్రతి మహిళా నెల నెలా డబ్బు చెల్లించాలి. రెండో నెల, లేదంటే మూడో నెల 50 వేలు అప్పు ఇస్తాం. దీనికి కేవలం 70 పైసలు మాత్రమే వడ్డీ అని నమ్మబలికారు. అంతటితో ఆగకుండా... రెండు కిస్తీలు కట్టిన వారికి గ్రైండర్లు ఇస్తాం అంటూ హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే... కొందరు మహిళలకు గ్రైండర్లు పంపిణీ చేశారు. దీంతో ఆ సంస్థపై నమ్మకం కలిగింది. మరికొందరు ఇందులో చేరి డబ్బులు కట్టారు.
కేవలం డోన్ పట్టణంలోనే కాకుండా నంద్యాల జిల్లాలోని ప్యాపిలి, దొరపాడు, పెద్ద పూజర్ల సహా ఇతర గ్రామాల్లోనూ వందలాదిగా మహిళలు డబ్బులు చెల్లించారు. కొందరు 4 వేల రూపాయల వరకు కట్టారు. మరికొందరు 5 వేలు కట్టారు. వీరిలో కొద్ది మందికి మాత్రమే... గ్రైండర్లు పంపిణీ చేశారు. మూడో నెల డబ్బులు ఇస్తామన్న కంపెనీ ప్రతినిధులు... తీరా సమయానికి కనిపించకుండాపోయే సరికి బాధితులు ఫోన్లు చేశారు. ఫోన్ నంబర్లు స్విచ్ ఆఫ్ వస్తుండటంతో మోసపోయామని తెలుసుకుని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.
ఫస్ట్ 10మందికి మీటింగ్ పెట్టారు. నెల నెలా డబ్బులు కడితే ఫ్రిజ్, టీవీ ఇస్తామన్నారు. నెల నెలా 23నెలల పాటు 2500 చెల్లించాలన్నారు. ముందుగా కొంత మందికి ఇవ్వడంతో నమ్మకం కలిగింది. ఇవాళ ఇస్తామని చెప్పి సెల్ స్విచ్ ఆఫ్ చేశాడు - శ్రావణి, బాధిత మహిళ
చాలా మంది మహిళలు కూలి పనులకు వెళ్లే వాళ్లే. తినీ తినక, కూడబెట్టకున్న డబ్బులు కట్టి మోసపోయారు. నెలనెలా 2500 కట్టాలనడంతో 2500, 1500 కట్టినం. 50వేలు వస్తే ఏదైనా అవసరానికి ఉపయోగపడతాయనుకున్నాం. కానీ, మోసపోయాం. - చంద్రకళ, బాధిత మహిళ
50 వేల రూపాయలు 70 పైసల వడ్డీకి ఇస్తామన్నారు. డబ్బులు నెలనెలా కట్టాలన్నారు. పేదవాళ్లం కదా డబ్బులు అవసరం ఉంటాయని కూడబెట్టుకుని డబ్బులు కట్టాం. మా గ్రూపులో పది మందిమి.. 40వేలు చెల్లించాం. - సరస్వతి, బాధిత మహిళ
గుంటూరు నుంచి ఇద్దరు వచ్చారు. నెలనెలా డబ్బులు కడితే గిఫ్ట్ కూడా ఇస్తామన్నారు. కానీ, అందరినీ మోసం చేశారు. మేమంతా మోసపోయాం. సెల్ స్విచ్ ఆఫ్ చేసినారు. మేమందరం పనులకు వెళ్లి డబ్బులు కూడబెట్టుకుని వాళ్ల చేతిలో మోసపోయాం. మాకు న్యాయం చేయాలి. - హుస్సేన్ బీ, బాధిత మహిళ
ఈ స్కీము ద్వారా వందల మంది బాధితులు మోసపోయినట్లు సమాచారం. పేద మహిళలను మోసం చేస్తున్న ఇలాంటి సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.