Yuvagalam 100th Day: మాతృదినోత్సవం రోజు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ను కలిసేందుకు వచ్చిన ఆయన తల్లి భువనేశ్వరి.. సోమవారం యువగళం పాదయాత్ర 100వ రోజు సందర్భంగా ఆయనతో కలిసి నడవనున్నారు. భువనేశ్వరితో పాటు నందమూరి, నారా కుటుంబ సభ్యులు, లోకేశ్ చిన్ననాటి స్నేహితులు యాత్రలో పాల్గొననున్నారు. యువగళం 100వరోజు పాదయాత్రను పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు పార్టీ సభ్యులు విస్తృత ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సంఘీభావ కార్యక్రమాలు చేపట్టాలని టీడీపీ నిర్ణయించింది.
175 నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు పాదయాత్రలు, ఇతర సేవా కార్యక్రమాలు చేపట్టనున్నారు. లోకేశ్ పాదయాత్రలో భాగంగా ఈ రోజు బోయరేవుల నుంచి బండి ఆత్మకూరు వరకు యాత్ర కొనసాగనుంది. మోతుకూరులో 100 రోజుల పాదయాత్ర పైలాన్ ఆవిష్కరణ జరుగనుంది. ఇప్పటి వరకు 1268.9 కి.మీ మేర సాగిన పాదయాత్ర శ్రీశైలం నియోజక వర్గంలో కొనసాగనుంది. ఇప్పటికి 34 నియోజకవర్గాల్లో లోకేశ్.. యువగళం పాదయాత్ర పూర్తి చేసుకున్నారు. 100 రోజుల ఈ సుదీర్ఘ పాదయాత్రలో 32 బహిరంగసభలు నిర్వహిచారు. దీంతోపాటు 87 ముఖాముఖి కార్యక్రమాలు, హలో లేకేశ్తో నాలుగు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 45 రోజులు, ఉమ్మడి అనంతపురంలో 23 రోజులు, ఉమ్మడి కర్నూలు జిల్లాలో 32 రోజుల పాటు లోకేశ్ పాదయాత్ర కొనసాగింది. అనేక అడ్డంకులను అధిగమిస్తూ, విశేష ప్రజాదరణతో యువగళం పాదయాత్ర ముందుకు దూసుకుపోతుందని తెలుగుదేశం నేతలు అభివర్ణించారు. ప్రతి నియోజకవర్గంలో 3 వేల మంది పార్టీ శ్రేణులతో 7 కిలోమీటర్ల మేర పాదయాత్రలు చేపట్టనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తమ నియోజకవర్గాలలో జరిగే సంఘీభావ పాదయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని టీడీపీ పిలుపునిచ్చింది.
99వ రోజు పాదయాత్రలో భాగంగా ఎన్టీఆర్ అందుబాటులోకి తెచ్చిన తెలుగుగంగ ప్రాజెక్ట్ వద్ద సెల్ఫీ దిగిన లోకేశ్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. రాయలసీమ ప్రజలకు సాగునీరు, చెన్నై వాసులకు తాగునీరు అందించాలన్న విశాల దృక్పథంతో తాత ఎన్టీఆర్ కట్టిన తెలుగుగంగ ప్రాజెక్టు ఇదంటూ గుర్తుచేశారు. దీని ద్వారా రాయలసీమలోని 1.75 లక్షల ఎకరాలకు సాగునీరు అందడమేగాక చెన్నై వాసుల దాహార్తి తీరుతోందన్నారు. అధికారంలోకి వచ్చినప్పటినుంచి దోచుకోవడం, దాచుకోవడమే తప్ప రాయలసీమ ప్రజల కోసం ఒక్క పిల్లకాలువ అయినా నిర్మించావా జగన్ అంటూ సీఎంను లోకేశ్ నిలదీశారు.
ఇవీ చదవండి: