కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదీ తీరంలో 21 ఘాట్ల నిర్మాణానికి అధికారులు నిర్ణయించారు. దీనికై రూ.22.92కోట్లు కేటాయించారు. టెండర్ల ప్రక్రియ అక్టోబర్ 21న పూర్తి చేశారు. కర్నూలులో నాగసాయి దేవస్థానం, సంకల్‌బాగ్, రాఘవేంద్రస్వామి మఠం, సుంకేసుల బ్యారేజీ, మంత్రాలయంలో ఎన్‌ఏపీ పంపుహౌస్, సంతవీధి, మేళిగనూరు, గురజాల ఘాట్‌లు 2008లో వేసినవే. కొన్ని దెబ్బతినగా, మరికొన్నింటికి 2009 వరదల తర్వాత మరమ్మతులు చేశారు.
ప్రస్తుతం ప్రతి ఘాట్‌కు సరాసరిన రూ.కోటిపైనే కేటాయింపులు జరిగాయి. రూ.లక్షల్లో పనులకు రూ.కోట్లల్లో కేటాయింపులపై ప్రజలు నోరెళ్లబెడుతున్నారు. ఇది కేవలం రాజకీయ ఒత్తిడితోనే జరిగినట్లు ఆరోపిస్తున్నారు.
నాణ్యత ఊసేలేదు
మంత్రాలయం పరిధిలో జరిగే పనుల్లో నాణ్యత ఊసే ఉండటం లేదు. ఘాట్ల నిర్మాణం కోసం పునాదులు తీస్తే నీటి ఊటలు ఆగకుండా వస్తున్నాయి. ఇంజన్లతో ఓ వైపు తోడేస్తూ, మరోవైపు ఊట నీటిలోనే కాంక్రిట్ పనులు చేస్తుండటం చూపురులను ముక్కున వేలేసేలా చేస్తోంది.
మెట్ల తర్వాత చేపట్టే బేస్‌మెంట్‌కు ఉపయోగించే మిశ్రమంలో నాసిరకం కంకరతోపాటు, డస్ట్ పొడి ఎక్కువగా వాడుతున్నారు. ఒక యంత్రంలో పేరుకు ఆరు బస్తాల సిమెంట్ అంటూ కేవలం మూడింటితో సరిపెడుతున్నారు. ఆ మిశ్రమాన్ని 1.8మీటర్ల దూరానికి ఒకేసారి ఉపయోగిస్తున్నారు. పనులు జరిగే చోట్ల అధికారుల పర్యవేక్షణ కరవై నాణ్యత లోపిస్తోంది. మరోవైపు మెట్ల నిర్మాణానికి పెద్దసైజు కంకర వాడటంతో రోజుల వ్యవధిలోనే నాణ్యత తేలిపోతోంది. ఆ నాసిరకం పనులపై ప్లాస్టింగ్ చేసి ముస్తాబు చేస్తున్నారు.
గత నిర్మాణాలకే తుది మెరుగులు..
గతంలో నిర్మించిన ఘాట్ల మెట్లకు అక్కడక్కడా సిమెంటు వేసి టైల్స్ పరిచేస్తున్నారు. కర్నూలు నగరంలో నాగసాయి దేవస్థానం ఎదురుగా ఉన్న ఘాట్‌లో ఇదే తంతు జరుగుతోంది. ఈ ఘాట్‌కు రూ.1.40కోట్లు కేటాయించగా, టెండర్‌లో గుత్తేదారు కోట్ చేయటంతో... ఈ పని విలువ రూ.1.10కోట్లుగా మారింది. బహిరంగ మార్కెట్‌లో ఫుట్‌పాత్, పార్కింగ్ టైల్స్‌గా పిలుస్తారు. ఒక అడుగు ఉండే టైల్స్ ధర రకాన్ని బట్టి రూ.24-30లోపు ఉంటుంది. ఇలా మెట్లకు ఎన్ని టైల్స్ వేసినా ఎంత ఖర్చు అవుతుంది? దీనికై రూ.కోట్లు ఎందుకు వెచ్చిస్తున్నారు? ఎవరి లాభం కోసం? ప్రతిపాదనల సమయంలో అంచనాలు ఎందుకు పెంచి పంపారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇదీ చదవండి: