ఏపీ మానవ హక్కుల కమిషన్, లోకాయుక్తలను రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. హెచ్‌ఆర్సీలు, లోకాయుక్తలు హైకోర్టు తుది తీర్పునకు లోబడే ఉంటాయని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయంపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను 5 వారాలకు వాయిదా వేసింది.
హెచ్‌ఆర్సీ, లోకాయుక్తలను కర్నూలులో ఏర్పాటు చేయాలని కేబినెట్ తీర్మానించిందని ప్రభుత్వం తరఫు న్యాయవాది గత విచారణలో ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్లు గత విచారణలో తెలిపారు. తాజాగా జరిగిన విచారణలో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ధర్మాసనానికి తెలిపారు. కర్నూలులో ఇప్పటికే లోకాయుక్త కార్యాలయన్ని ప్రారంభించామన్నారు. వాదనలు విన్న ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీ విభజన చట్ట నిబంధనలకు విరుద్ధం
ఏపీ లోకాయుక్త, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్‌ఆర్సీ) కార్యాలయాలు కర్నూలులో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సవాలు చేస్తూ.. హైకోర్టులో పిల్ దాఖలైంది. ఆయా సంస్థల ఏర్పాటుకు సంబంధించిన చర్యలను నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని.. అమరావతి ఐకాస నేత, డాక్టర్ మద్దిపాటి శైలజ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. కర్నూలులో లోకాయుక్త, ఏపీహెచ్ఆర్సీని ఏర్పాటు చేయడం ఏపీ విభజన చట్ట నిబంధనలకు విరుద్ధం అని పేర్కొన్నారు. పరిపాలనకు సంబంధించిన శాసన, న్యాయ, కార్యనిర్వహణ వ్యవస్థలు రాజధానిలో ఉండాలని చెప్పారు.
ఇదీ చదవండి:
Minister Gowtham Reddy: రాజధాని అనే పదం రాజ్యాంగంలోనే లేదు: మంత్రి గౌతంరెడ్డి