Vijay Paul Situation in Jail: సీఐడీలో అదనపు ఎస్పీగా పనిచేస్తూ పదవీ విరమణ పొందినా అందులోనే ఓఎస్డీ పోస్టును వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆయనకు కట్టబెట్టింది. అదే అదనుగా అప్పటి అధికార పెద్దల అండదండలతో కన్నూమిన్ను కానరాకుండా వ్యవహరించారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. తనకు సముచిత స్థానమిచ్చిన వారికి వ్యతిరేకంగా మాట్లాడటాన్ని సహించలేకపోయారు. చట్టాలను తుంగలో తొక్కి, నాటి అధికార పార్టీ ప్రత్యర్థులను వేధింపులకు గురిచేశారు. తమ అధినేతల కళ్లలో ఆనందం చూడటానికి ఇష్టానుసారం చెలరేగిపోయారు. తీరా అధికారం మారిన తర్వాత కేసులో చిక్కుకుని చివరికి జైలు‘పాల్’ అయ్యారు.
నిందితుడిగా మారి: ఎస్సై, సీఐ, డీఎస్పీగా మూడు దశాబ్దాలకు పైగా సర్వీసులో ఎన్నో వేల కేసులు రికార్డు చేసి ఉంటారు రావెల విజయ్‌పాల్. అంతకుమించిన సంఖ్యలో నేరగాళ్లను విచారించి ఉంటారు. గత వైఎస్సార్సీపీ పాలనలో సీఐడీ విభాగం అదనపు ఎస్పీగా, ఓఎస్డీగా ఎంతోమందిని వివిధ కేసుల్లో అరెస్టు చేశారు. చివరికి అప్పటి అధికార వైఎస్సార్సీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్టు వ్యవహారంలోనూ తాడేపల్లి ప్యాలెస్ ఎలాచెప్తే అలా చేశారు. రఘురామను చిత్రహింసలు పెట్టిన కేసులో ప్రస్తుతం తానే నిందితుడిగా మారారు. సీఐడీ ఏఎస్పీగా రఘురామపై నమోదైన కేసులో దర్యాప్తు అధికారిగా ఉన్న ఆయన ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. అదే కేసులో తాను ఇరుక్కుని నిందితుడిగా పోలీసు స్టేషన్‌లో చాపపై పడుకోవాల్సిన దుస్థితిని తెచ్చుకున్నారు.
గుండెపోటుతో మరణించేలా కుట్ర - విజయ్‌పాల్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు
ప్రశాంతత కరవు: ప్రకాశం జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం విజయ్‌పాల్ విచారణకు హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు కార్యాలయానికి వస్తే సాయంత్రం 4 వరకు ఒక గదిలో ఆయనొక్కడే పోలీసు పహారా మధ్య గడపాల్సి వచ్చింది. అదే పోలీసు శాఖలో ఒకప్పుడు దర్పం ఒలకబోసిన వ్యక్తి గంటల తరబడి ఎవరితో మాట్లాడే అవకాశం లేకుండా, భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉండాల్సి వచ్చింది.
ఒకప్పుడు దర్యాప్తు అధికారిగా వందల మందిని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసిన ఆయన, ఇప్పుడు అదే శాఖలోని అధికారుల ఎదుట చేతులు కట్టుకుని ప్రశ్నలకు తడబడుతూ సమాధానాలు చెప్పాల్సిన దయనీయ స్థితిని ఎదుర్కొన్నారు. పోలీసు స్టేషన్‌లో ఒక రాత్రి అంతా బందీగా ఉండాల్సి వచ్చింది. నాటి అధికార వైఎస్సార్సీపీతో అంటకాగి ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఫలితంగా ఆ అధికారి ఉద్యోగ విరమణ పొందినప్పటికీ ఇప్పుడు ప్రశాంతమైన జీవితం కరవైంది. నిబంధనలను తుంగలో తొక్కి అధికార దుర్వినియోగానికి పాల్పడితే ఎటువంటి దుస్థితి ఎదుర్కోవలసి వస్తుందో చెప్పేందుకు విజయ్‌పాల్ ఓ ప్రత్యక్ష ఉదాహరణ అనే చర్చ పోలీసు శాఖలో ఇప్పుడు సాగుతోంది.
"RRR కస్టోడియల్ హింస కేసు" - సీఐడీ మాజీ ఏఎస్పీ విజయ్‌పాల్‌కు రిమాండ్