గతేడాది ఆగస్టు 17న కర్నూలు జిల్లాలో పొలానికి వెళ్తున్న ముస్లిం యువతి హత్యకు గురైంది. ఆమెపై అత్యాచారం జరిపి హతమార్చారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఇప్పటివరకూ ఈ కేసులో పురోగతి లేకపోవటంపై ప్రతిపక్షనేతలు నిరసన వ్యక్తం చేశారు. తెలుగుదేశం, కాంగ్రెస్, సీపీఐ, జనసేన, ఎస్డీపీఐ, ఎమ్ఐఎమ్ నేతలు బాధితురాలి గ్రామంలో పర్యటించారు. నారా లోకేశ్ ఆధ్వర్యంలో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, తదితరులు బాధిత కుటుంబసభ్యులతో మాట్లాడారు.
దాడులు జరిగితే పట్టించుకోరా... ?
జెండా పండుగ రోజే రమ్యశ్రీ హత్య సహా రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. బాధితురాలికి న్యాయం చేయకపోతే అమరావతిలో అఖిలపక్ష నేతలతో ఆందోళన నిర్వహిస్తామని తెలిపారు. ఇష్టానుసారంగా దుండగులు రెచ్చిపోతుంటే దిశచట్టం ఎక్కడ ఉందని నారా లోకేశ్ ప్రశ్నించారు. కుమార్తెను దారుణంగా హతమార్చిన నిందితులకు శిక్ష పడాలని తల్లి పోరాడుతుంటే... ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు. సామాజికమాధ్యమాల్లో పోస్టులకే అరెస్టులు చేయిస్తున్న సీఎం జగన్... మహిళలపై దాడులు జరిగితే పట్టించుకోరా అని ప్రశ్నించారు.
ఉద్యమం చేపడతాం.. ?
కర్నూలు యువతి హత్యాచార ఘటనలో నిందితులు వైకాపాకు చెందినవారనే అందరూ చెబుతున్నారని 21 రోజుల్లో అరెస్టు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని నారా లోకేశ్ హెచ్చరించారు. నారా లోకేశ్ పర్యటనను వైకాపా శ్రేణులు అడ్డుకునే యత్నం చేయగా.. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి అవాంతరాలు రాకుండా చేశారు.
ఇవీచదవండి.