అధికారాన్ని అడ్డం పెట్టుకుని మంత్రి జయరాం... కర్నూలు జిల్లాలోని ఓ ప్రైవేట్ సంస్థ నుంచి భూములు కొన్నారని తెదేపా నిజనిర్ధరణ కమిటీ ఆరోపించారు. నిజనిర్ధరణ కమిటీ సభ్యులు ఎమ్మెల్సీలు బీటెక్ రవి, బీటీ నాయుడు, మాజీ ఎమ్మెల్యేలు ప్రభాకర్ చౌదరి, ఈరన్న... కర్నూలు జిల్లా ఆస్పరిలో పర్యటించారు. భూములు అమ్మిన రైతులతో మాట్లాడారు. తమ వద్ద 15 ఏళ్ల క్రితం ప్రైవేట్ సంస్థ తక్కువ రేటుకు... భూములు కొనుగోలు చేసిందని రైతులు తెలిపారు. కంపెనీ ఏర్పాటైన తర్వాత ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి రైతులకు హామీ పత్రాలు ఇచ్చారని కమిటీ సభ్యులకు చెప్పారు. 15 ఏళ్లుగా కంపెనీ ఏర్పాటు కోసం ఎదురు చూసినా ఏర్పాటుకాలేదన్నారు. తమ భూములు తిరిగి ఇవ్వాలని రైతులు కమిటీ సభ్యులకు వివరించారు.
కంపెనీ డైరెక్టర్లలో ఒకరైన మంజునాథ్‌ను అడ్డం పెట్టుకుని మంత్రి జయరాం.. ఇతర డైరెక్టర్ల సంతకాలు ఫోర్జరీ చేసి భూములు కొన్నారని తెదేపా నిజనిర్ధరణ కమిటీ ఆరోపించింది. భూములు ఎవ్వరూ వదులుకోవద్దని, రైతులకు తెదేపా అండగా ఉంటుందన్నారు. కోర్టులకు వెళ్లైనా న్యాయం జరిగేలా చూస్తామని బృందం సభ్యులు రైతులకు హామీ ఇచ్చారు.