SRISAILAM: శ్రీశైలంలోని దేవస్థాన పరిపాలన భవనంలో ధర్మకర్తల మండలి నాలుగో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి దేవస్థానం ఈవో ఎస్.లవన్న, ఛైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి, ఇతర సభ్యులు హాజరయ్యారు. ఈ సమావేశంలో 46 అంశాలను ప్రవేశపెట్టారు. ఇందులో 42 అంశాలకు ఆమోదం తెలిపిన ధర్మకర్తల మండలి.. మూడింటిని తిరస్కరించగా, మరొక అంశాన్ని వాయిదా వేసింది. ధర్మకర్తల మండలి సమావేశం ఐదు గంటల పాటు సుదీర్ఘంగా సాగింది. ఈ సమావేశంలో ధర్మకర్తల మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆలయానికి ఎదురుగా ఉన్న దుకాణాలను లలితాంబికా సముదాయంలోకి మార్చడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఇందులో భాగంగా సోమవారం లలితాంబికా సముదాయంలోని దుకాణాలకు బహిరంగ వేలం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఛైర్మన్ రెడ్డి వారి చక్రపాణి రెడ్డి స్పష్టం చేశారు. ఆలయానికి ఎదురుగా ఉన్న దుకాణాలను తొలగించి ఆ ప్రదేశంలో సుందరీకరణ చర్యలు, భక్తులకు సదుపాయాలు కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. భక్తులకు మరిన్ని మరుగుదొడ్ల సదుపాయాలు కల్పించేందుకు రూ.1.50 కోట్లతో పనులు చేయడానికి టెండర్లు పిలవనున్నట్లు తెలిపారు.
ఇవీ చదవండి:
రూ.20 లక్షల విలువైన ఎర్రచందనం పట్టివేత..17 మంది అరెస్టు