కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణ శివార్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఆళ్లగడ్డ పురపాలిక పరిధిలోని పడకండ్ల గ్రామానికి చెందిన శ్రీనివాసులు తన భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి ద్విచక్ర వాహనంలో బంధువుల ఇంట్లో జరుగుతున్న శుభ కార్యక్రమంలో పాల్గొనేందుకు రుద్రవరం మండలం పేరూరు గ్రామానికి బయలుదేరాడు. వీరు వెళ్తున్న వాహనాన్ని ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం ఢీకొంది. ఈ ఘటనలో బైకు ముందు భాగాన కూర్చొని ఉన్న శ్రీనివాసులు కుమారుడు శర్వానంద్ (4) అక్కడికక్కడే మృతి చెందాడు.
తీవ్రంగా గాయపడిన శ్రీనివాసులు, అతని భార్య వెంకట సుబ్బమ్మ, కుమారుడు చరణ్, కుమార్తె హరితతో పాటు.. ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న రామలింగారెడ్డి, చైతన్య తీవ్రంగా గాయపడ్డారు. వీరందరినీ 108 వాహనంలో ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన రామలింగారెడ్డి ఆసుపత్రిలో మృతి చెందాడు. శ్రీనివాసులు, చైతన్యల పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం నంద్యాలకు తరలించారు. ఆళ్లగడ్డ సీఐ కృష్ణయ్య ,ఎస్ఐ రామాంజనేయులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.
ఇదీ చదవండి: