కర్నూలు జిల్లాలో కోడుమూరు పట్టణాన్ని అనుకుని ఉన్న ప్రభుత్వ కొండ వద్ద ఎర్రమట్టి మాఫియా యథేచ్ఛగా కొనసాగుతోంది. సర్వే నెం 181-18 నెంబరులో 95 ఎకరాల్లో ఈ కొండ విస్తరించి ఉంది. ఈ కొండకు నలువైపులా ప్రతి రోజు 50 నుంచి 60 ట్రిప్పుల గ్రావెల్ తరలిపోతోంది. ఒక్కో ట్రాక్టర్ రూ.1500, డంపర్ ఐతే 5 నుంచి 6 వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. అక్రమ తవ్వకాలతో ఆనవాళ్లు కోల్పోయిన కొండ ప్రాంతంలో మరికొందరు స్థలాలు కబ్జా చేసి ఫ్లాట్లు వేస్తుండటం గమనార్హం.
సి.బెళగల్‌లోని 462 సర్వే నెంబరులో ఎర్రమట్టి భారీగా తలిపోతోంది. అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు అక్రమ తరలింపుతో జేబులు నింపుకుంటున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే పేదలకిచ్చే ఇళ్ల స్థలాల వద్ద రోడ్ల నిర్మాణానికి తీసుకెళ్తామని సాకులు చెబుతున్నారు. నెలకు కోటి రూపాయల విలువ చేసే ఎర్రమట్టి అక్రమంగా తరలిపోతోంది. గత కొన్ని నెలలుగా మట్టి దందా చేస్తున్నా మైనింగ్ అధికారులు దృష్టి పెట్టలేదు.
అదేవిధంగా కోడుమూరు నియోజకవర్గం గూడూరు పరిధిలోనే చనుగొండ్ల, బూడిదపాడు, కె.నాగలాపురం కొండల్లో గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయి. రెండు నెలల క్రితం బూడిదపాటు కొండ నుంచి తరలిస్తున్న వాహనాలను స్థానికులు నిలిపివేశారు. సి.బెళగల్‌లో ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని మైనింగ్ ఏడీ శివారెడ్డి తెలిపారు. సదరు తవ్వకాలు తమ దృష్టికి వచ్చిందని సంబంధిత వ్యక్తిని వివరణ కోరుతూ నోటీసులు జారీ చేస్తున్నామన్నారు.
ఇదీ చదవండి: నేటి నుంచి రాజధాని వ్యాజ్యాలపై రోజువారీ విచారణ