రాష్ట్రంలో ప్రాజెక్టులకు జలకళ నెలకొంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు వరద నీటి ప్రవాహం ఎక్కువైంది. శ్రీశైలం ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. స్పిల్ వే ద్వారా 1,12,300 క్యూసెక్కుల నీటి విడుదల చేశారు. జలాశయం ఇన్‌ఫ్లో 1,73,726 క్యూసెక్కులు. శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 885.0 అడుగులుగా ఉంది.
ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజీకి 3,64,950 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రకాశం బ్యారేజీ నుంచి కాల్వలకు 4,829 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు తెరిచి దిగువకు 3.57 లక్షల క్యూసెక్కుల విడుదల చేశారు. ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజీకి స్వల్పంగా నీటి ప్రవాహం తగ్గుతోంది.
విజయవాడలో కృష్ణానదిని ఆనుకుని ఉన్న ప్రాంతాల్లోకి వరదనీరు ముంచెత్తింది. కృష్ణ లంక, తారకరామనగర్ తదితర చోట్ల వరదనీరు ఇళ్లలోకి చేరింది. ముందుజాగ్రత్తగా 50 కుటుంబాలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. అవనిగడ్డ మండలం పులిగడ్డ వద్ద 12 అడుగుల మేర కృష్ణానది ప్రవాహం కొనసాగుతోంది.
సోమశిల జలాశయానికి ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయ ప్రస్తుత నీటిమట్టం 72 టీఎంసీలుగా కొనసాగుతోంది. పూర్తి స్థాయి నీటి మట్టం 78 టీఎంసీలు. ఉదయం 50 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. పెన్నా పరివాహక ప్రాంతాల వాసులను అప్రమత్తం చేశారు.
ఇదీ చదవండి: