Problems at Jagananna Colonies in AP: అన్ని రకాల హంగులతో నిరుపేదలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని చెబుతున్న పాలకుల మాటలకు క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులకు పొంతనే లేదు. నివాసయోగ్యం కాని ప్రాంతాల్లో కనీస వసతులు ఏర్పాటు చేయకుండానే స్థలాలు ఇచ్చి జనాన్ని నట్టేట ముంచుతున్నారు. కొన్నిచోట్ల గ్రామాలు, పట్టణాలకు అల్లంత దూరంలో ఉన్న కొండల్లో ఇస్తే మరికొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాల్లో చినుకుపడితే చిత్తడిగా మారే చోట కేటాయించారు. దీంతో ఇళ్లు కట్టేందుకు లబ్ధిదారులు ముందుకు రావటం లేదు. మరోవైపు గుత్తేదారులకు కోట్ల రూపాయలు కట్టబెడితే వారేమో నాసిరకం మెటీరియల్‌తో అరకొరగానే పూర్తిచేశారు. ఇలా అడుగడుగునా జగనన్న కాలనీల నిర్మాణంపై ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది.
చుట్టూ కంప చెట్లు, ముళ్ల పొదలు మధ్యలో ఇళ్లు. ఇదీ జగనన్న కాలనీ దుస్థితి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని 3 మండలాల్లో 5వేల మందికి ఇళ్లు మంజూరు చేశారు. స్థానిక నేతల నిర్లక్ష్యంతో కాలనీల్లో పిచ్చి మొక్కలు మొలిచాయి. అంతర్గత రహదారులు కూడా లేవు. కనీస సౌకర్యాలు లేని కాలనీల్లో ఉండలేమంటూ చాలా మంది లబ్ధిదారులు చేతులెత్తేశారు. ప్రభుత్వమిచ్చే సాయం ఏ మూలకూ రావట్లేదంటూ మరికొందరు పునాది వరకు వేసి ఆపేశారు.
ముంపు ప్రాంతాల్లో జగనన్న కాలనీలు - వర్షాలొస్తే నరకం కనిపిస్తోందంటున్న లబ్దిదారులు
ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఇలాకాలో జగనన్న కాలనీ దుర్భరంగా మారింది. డోన్‌లో రెండు చోట్ల జగనన్న కాలనీకి ప్రభుత్వం స్థలం కేటాయించింది. దొరపల్లి గుట్ట వద్ద 2వేల335, ఉడుములపాడు సమీపంలో 16వందల79 మంది అర్హులకు స్థలాలు మంజూరు చేశారు. దొరపల్లి గుట్ట కొండపై ఉండటంతో ఇక్కడ ఇళ్లు కట్టేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదు. అధికారులు, వాలంటీర్లు ఒత్తిడి చేయడంతో కొందరు గృహాలు నిర్మించారు.
ఇటీవల కురిసిన వర్షాలకు ఉడుములపాడు వద్ద జగనన్న కాలనీ చిత్తడిచిత్తడిగా మారింది. లోతట్లు ప్రాంతాల్లో స్థలాలు ఇస్తే ఇక్కడెలా నివాసం ఉండాలంటూ లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదోనిలో 10 వేల మందికి స్థలాలు మంజూరు చేశారు. అటవీ ప్రాంతంలో ఇవ్వడంతో లబ్ధిదారులు ఇళ్లు కట్టేందుకు ముందుకు రాలేదు. దీంతో నిర్మాణ బాధ్యతను పాలకులు గుత్తేదారునికి కట్టబెట్టారు.
10 వేల గృహాలకు కాంట్రాక్టు ఇస్తే ఇప్పటికీ వెయ్యి ఇళ్ల నిర్మాణ పనులు మాత్రమే జరుగుతున్నాయి. కోట్లాది రూపాయలను గుత్తేదారునికి చెల్లించినా ఇళ్లలో నాణ్యత లోపించింది. సీఎం జగన్ మాత్రం కోట్ల రూపాయలు పెట్టి బాత్రూమ్ కట్టుకుంటే పేదలను మాత్రం ఎలాంటి వసతుల్లేని నాసిరకం ఇళ్లలో ఎలా ఉంచుతారని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు.
లోతట్టు ప్రాంతాల్లో జగనన్న ఇళ్ల నిర్మాణం - నీట మునిగిన కాలనీలు, అవస్థల్లో ప్రజలు