కర్నూలు జిల్లా నంద్యాలలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రానికి చెందిన భూమిలో వైద్య కళాశాల ఏర్పాటుకు 50 ఎకరాల కేటాయింపును సవాలు చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, కలెక్టర్, పరిశోధన కేంద్రం అసోసియేట్ డైరెక్టర్ పలువురికి నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను 3వారాలకు వాయిదా వేసింది. న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ బి.కృష్ణమోహన్‌తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
పరిశోధనా కేంద్రానికి చెందిన భూమిని వైద్య కళాశాల నిర్మాణానికి కేటాయించే విషయంలో రెవెన్యూశాఖ ఈ నెల 12 న జారీ చేసిన జీవో 341ను సవాలు చేస్తూ నంద్యాలకు చెందిన దశరథరామిరెడ్డి, మరో నలుగురు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. వందల ఏళ్లుగా రైతులకు విత్తనాలు అందిస్తున్న పరిశోధన కేంద్రానికి చెందిన భూమిని కేటాయించడం సమర్థనీయం కాదని వారి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. దీనిలో జోక్యం చేసుకోకుండా ప్రభుత్వాన్ని నిలువరించండని కోరారు. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించగా... ప్రతివాదుల వైఖరి తెలుసుకునేందుకు 2వారాలు సమయమిద్దామని నోటీసులు జారీచేసింది.
ఇదీ చదవండి