తాడిపత్రి నుంచి ఇసుక
కర్నూలు జిల్లాలో ప్రధానంగా తుంగభద్ర నది నుంచే ఎక్కువగా ఇసుక తవ్వి తీస్తారు. రెండు నెలల నుంచి నదిలో వరద ఎక్కువగా ఉన్నందున ఇసుక తీయటం కష్టంగా మారింది. అనంతపురం జిల్లా తాడిపత్రి నుంచి దిగుమతి చేసుకోవాలని నిర్ణయించారు. అందులో భాగంగా పాణ్యం, కర్నూలు, బనగానపల్లిలో 3 ఇసుక డిపోలు ఏర్పాటు చేశారు. వీటిలో తాడిపత్రి ఇసుకను అందుబాటులో ఉంచారు. అయినా... ఈ ఇసుక కొనుగోలు చేసే నాథుడే కరవయ్యాడు.
అధిక ధరలు
నాలుగు టన్నుల ఇసుక తీసుకువెళ్లేందుకు మొత్తం 3 నుంచి 4 వేల రూపాయల వరకు ఖర్చు అవుతోంది. దీనికి తోడు డిపోల వద్ద వే బ్రిడ్జిలు లేవు. సీసీ కెమెరాలు లేవు. టన్ను, రెండు టన్నులు కావాలంటే ఇవ్వరు. ఈ సమస్యలతో ఇసుక కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపటం లేదు. తాడిపత్రి నుంచి కర్నూలు జిల్లా డిపోలకు తరలించిన ఇసుకలో నాణ్యత లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీన్ని తీసుకువెళ్లటం కంటే కొద్దిరోజులు నిర్మాణాలు ఆపేయటమే మేలని ప్రజలు భావిస్తున్నారు.
నాణ్యమైన ఇసుకను అందుబాటులో ఉంచితే కాస్తంత ధర ఎక్కువైనా కొనుగోలు చేయటానికి సిద్ధంగా ఉన్నామని ప్రజలు చెబుతున్నారు. అంతేకానీ ఇలాంటి ఇసుక వల్ల ప్రయోజనం ఉండదని వాపోతున్నారు.