Muslims protest against Dulhan Scheme Dropped: పేద ముస్లిం యువతుల పెళ్లికి ఆర్థిక సాయం అందించే దుల్హన్ పథకానికి నిధులు లేవని హైకోర్టుకు ప్రభుత్వం విన్నవించడం దారుణమని మైనార్టీ నేతలు మండిపడ్డారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆందోళనలు నిర్వహించారు. నంద్యాల జిల్లా గడివేముల మండల తహశీల్దారు కార్యాలయం ఎదుట తెలుగుదేశం మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో ముస్లింలు ధర్నా చేశారు. దుల్హన్‌ను కొనసాగించాలంటూ తహసీల్దారుకు వినతిపత్రం ఇచ్చారు.
మైనారిటీలను సీఎం జగన్ మోసగించారంటూ కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం హుసేనాపురంలో ముస్లింలు నిరసన తెలిపారు. షాదిఖానా వద్ద జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దుల్హన్, విదేశీ విద్య, రంజాన్ తోఫాలకు వైకాపా మంగళం పాడిందని ఆక్షేపించారు. మైనార్టీల అభివృద్ధిని కాంక్షించి చంద్రబాబు పెట్టిన విదేశీ విద్య పథకాన్ని దుర్వినియోగం చేశారని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి నజీర్ అహ్మద్ మండిపడ్డారు. ఇచ్చిన హామీలను జగన్ నిలబెట్టుకోవాలని.. ముస్లింలకు ఆపేసిన పథకాలను తిరిగి ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వం మైనార్టీల హక్కులను కాలరాసేలా వ్యవహరిస్తోందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మస్తాన్ వలి మండిపడ్డారు. మైనార్టీలకు 5శాతం రిజర్వేషన్లను అడ్డుకున్న ఆర్.కృష్ణయ్యకు రాజ్యసభ ఇచ్చి జగన్ ముస్లింను మోసం చేశారని ఆక్షేపించారు.
ముస్లిం మైనార్టీలకు వైకాపా ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని కర్నూలులో తెలుగుదేశం నాయకులు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తే.. ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు నిలిపివేయడం దారుణమన్నారు. దుల్హన్ పథకాన్ని అమలు చేయడం సాధ్యం కాదని హైకోర్టులో వైకాపా ప్రభుత్వం చెప్పడం సిగ్గుచేటన్నారు. గతంలో 35 ఏళ్లు దాటిన ఒంటరి మహిళలకు పింఛన్ ఇచ్చేవారని.. ఇప్పుడు 50 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే ఇస్తామనడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు.
ప్రకాశం జిల్లాలో: పేద ముస్లిం ప్రజల కోసం తెదేపా తీసుకొచ్చిన దుల్హన్ పథకాన్ని రద్దుచేయడం హేయమైన చర్య అని మార్కాపురం తెదేపా మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే.. ముస్లిం పెళ్లిళ్లకు ఇచ్చే రూ. 50 వేలను రూ. లక్షకు పెంచుతాన్న ఈ ముఖ్యమంత్రి మాటలు ఏమయ్యాయన్నారు. అమ్మ ఓడి నగదు కోతతో పాటు విదేశీ విద్య కూడా లేకుండా చేశారని మండిపడ్డారు. ప్రమాద భీమా చెల్లించలేని జగన్ ప్రభుత్వం.. మాటల గారడీతో కాలాన్ని వెళ్లబుచ్చుతోందన్నారు. ప్రజలను అన్నివిధాల మోసం చేసిన జగన్కు ప్రజలు తగిన బుద్ది చెబుతారని నారాయణరెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి: