మార్క్‌ఫెడ్ ద్వారా కర్నూలు జిల్లాలో సుమారు 360 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. డిసెంబరు 2వ తేదీ నాటికి 10,673 మంది రైతుల నుంచి 70వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తులు కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన మొక్కజొన్న ఉత్పత్తులను గోదాంలకు చేర్చే బాధ్యత ఓ గుత్తేదారుకు అప్పగించారు. టన్నుకు రూ.190చొప్పున ఇచ్చేందుకు ధర నిర్ణయించారు. ప్రధాన గుత్తేదారు స్థానికంగా కొందరు ఉప గుత్తేదార్లకు రవాణా బాధ్యతలు ఇచ్చారు. రోజుల తరబడి లారీలు ఏర్పాటు చేయకుండా, రైతులే గోదాంలకు చేర్చుకోవాలని సలహా ఇచ్చారు.
రవాణా ఖర్చు మీ ఖాతాల్లో కలిపి వేయిస్తామంటూ ఉప గుత్తేదారులు ఇచ్చిన హామీతో రైతులే సొంతంగా సరకు గోదాంలకు తీసుకెళుతున్నారు. గోనె సంచులు, పురికొస(దారం), హమాలీల ఖర్చు, వే-బ్రిడ్జి ఇలా మొత్తం కలిసి ఒక్కో బస్తాకు రూ.30వరకు ఖర్చు తేలింది. తీరా గోదాం వద్దకు వెళ్లగా 2-3రోజుల పాటు సరకు దించుకోకపోవడంతో మూడు రోజుల ట్రాక్టరు బాడుగ రైతులపైనే పడుతోంది. ఇలా ఒక్కో రైతుపై రూ.3-5వేల వరకు భారం తప్పడం లేదు.
మొదట రైతులతో రవాణా ఖర్చు పెట్టించి ఆ తర్వాత ఇస్తామంటూ చేతులెత్తేసి అక్రమ భోజ్యానికి తెర తీస్తున్నారు. వాస్తవానికి రైతుకు ఖాతాలో తర్వాత రవాణా ఛార్జీ ఏమీ ప్రభుత్వం ఇవ్వదు. రవాణా కాంట్రాక్టు తీసుకున్న వారికే చెల్లిస్తుంది. గతేడాది సైతం ఇలానే రవాణా రైతులను చేసుకోవాలని, ఉప గుత్తేదార్లు సూచించి చివరికి నగదు జమ చేయకుండా జేబులు నింపుకున్నారు. గడివేముల మండలంలో గతేడాది రవాణా బాడుగా రూ.4లక్షల వరకు పెండింగ్ ఉంది. ఇలా జిల్లా మొత్తం రూ.లక్షల్లో రైతులకు కుచ్చుటోపీ పెట్టినట్లు సమాచారం.
ఇదీ చదవండీ... మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని రైతులకు ఇచ్చి ఆదుకోవాలి: పవన్