Men dressup as women to celebrate Holi in AP: హోలీ అంటే అందరికీ రంగుల కేళి.. కానీ ఆ ప్రాంతంలో రతి మన్మథులను మెప్పించి, ఒప్పించి తమ మెుక్కులను తీర్చు కోవడానికి పురుషులు స్త్రీలుగా మారి కేళి రెండు రోజులు పూజలు నిర్వహిస్తారు. అలా స్త్రీలుగా వేషం ధరించి పూజలు చేసినవారికి సంవత్సరమంతా ఎలాంటి ఆపదలు రావని ఆ గ్రామ ప్రజల నమ్మకం. ఆ నమ్మకంతోనే ఐదేళ్ల పిల్లోడి నుంచి 60 సంవత్సరాలు పైబడిన ముసలివాళ్లు సైతం ఈ రతిమన్మథ పూజ కోసం మహిళగా సింగారించుకునే ఆచారం కర్నూలు జిల్లాలో ఆనవాయితీగా వస్తోంది.
కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతెకుడ్లుర్ గ్రామంలో హోలీ పండుగ వచ్చిందంటే.. జంబలకిడి పంబ సినిమా తరహాలో వింత ఆచారం కొనసాగుతోంది. ఈ గ్రామంలో తరతరాల నుంచి ఇలా వింతైన సంప్రదాయం నడుస్తోంది. మగాళ్లు హోలీ రోజున చీరలు కట్టుకుని.. మహిళ్లలా సింగారించుకుంటారు. అనంతరం అనవాయితీగా నిర్వహించే రతి మన్మథుడికి పూజలు చేసే వేడుకల్లో పాల్గొంటారు. హోలీ రోజున సంతెకుడ్లుర్ గ్రామంలో మగాళ్లంతా.. చీరలు కట్టుకుని, నగలు, పూలు సింగారించుకొని అలంకరణ చేసుకుంటారు. హోలీ సందర్భంగా తమ గ్రామంలో ఏళ్లుగా వస్తున్న సంప్రదాయం ప్రకారం ఇలా చేస్తారని గ్రామస్థులు వెల్లడించారు. ఈ వేడుకల్లో పాల్గొనడానికి కర్ణాటక రాష్ట్రం నుంచి సైతం చాలామంది యవకులు వస్తారు. హోలీ రోజు పురుషులు ఆడవాళ్ల మాదిరిగా వేషధారణ చేసుకుని రతి మన్మథుడికి పూజలు చేస్తే అనుకున్న పనులు నెరవేరుతాయని వారి నమ్మకం.
'ఈ ఉత్సవం మేము ప్రతి సంవత్సరం జరుపుకుంటాము. మా తాత ముత్తాతలనుంచి ఈ పండుగను నిర్వహించుకుంటున్నాం. ఇలా పండగ నిర్వహించుకోవడం వల్ల మేము అనుకున్న పనులు జరుగుతాయి. ఆరోగ్య సమస్యలు, పెళ్లి సమస్య, విద్యా సమస్యలు... ఇతర ఎలాంటి సమస్యలు వచ్చినా మేము మెుక్కుకుంటాం. ఇలా పూజలు చేయడం వల్ల మా కోరికలు నెరవేరుతాయి. ఇది జంబలకడి పంబ తరహా లాంటి ఉత్సవం. ఈ పండుగ రెండు రోజులపాటు జరుగుతుంది.'- మహేష్, భక్తుడు
ఇలా పూజించడం వల్ల పంటలు బాగా పండుతాయని, గ్రామానికి కష్టాలు రాకుండా ఉంటాయని..ఆరోగ్య సమస్యలు, పెళ్లి సమస్యలు, అర్థిక సమస్యలు ఇలా ఇంట్లో ఏ సమస్యలు లేకుండా ఉంటాయని అక్కడివారి నమ్మకం. ప్రతి ఏటా.. హోలీ పండుగకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు ఈ వింత ఆచారాన్ని చూడడానికి భారీ ఎత్తున తరలివస్తారు. ఆంధ్రా, కర్ణాటక సరిహద్దు ప్రాంతం కావడం వల్ల ఈ వింతైన ఆచారం చూడడానికి కర్ణాటక నుండి భక్తులు భారీ ఎత్తున వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.
నేను ముప్పై సంవత్సారాల నుంచి మహిళగా సింగారించుకుంటున్నాను. మా ఇంట్లో ఆరోగ్యం బాగా లేనప్పుడు 30 సంవత్సరాల క్రితం నేను ఈ వేషం వేసుకున్నాను. అప్పటి నుంచి నేను అనుకున్న పనులు జరుగుతాయి. ఈ పండుగ రెండు రోజుల పాటు జరుగుతుంది. సుమారు 500మంది ఈ వేషం వేసుకుంటారు. ఈ రెండు రోజులు ఈ ఉత్సవం బాగా జరుగుతుంది. ఈ పండుగ చూడటానికి వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు వస్తారు. రంగ స్వామి, భక్తుడు
ఇవీ చదవండి: