కర్నూలు జిల్లాలోని మంత్రాలయం పుణ్యక్షేత్రానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. వారాంతపు రోజులు, సెలవులు, పండుగలు, ఆరాధనోత్సవాలకు... తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా... కర్ణాటక, తమిళనాడు నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ దేవాలయం పరిధిలో మొత్తం 804 గదులు ఉన్నాయి. వీటిలో సాధారణ గది రూ. 300, ఏసీ గదులు రూ. 500 వరకు ఉన్నాయి. ప్రైవేటు సత్రాలు ఉన్నా.. వచ్చేవారి అవసరాలను బట్టి వాటి యజమానులు ధరలను అమాంతం పెంచేస్తున్నారు. ప్రత్యేక రోజుల్లో ఒక్కో గదికి 5వేల వరకు వసూలు చేస్తుంటారు. అందుకే.. భక్తుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని.. మంత్రాలయ పీఠాధిపతి సుభుదేందు తీర్థులు గదుల ధరలు తగ్గించాలనే నిర్ణయం తీసుకున్నారు.
ఆ నిర్ణయం మేరకు మంత్రాలయం మఠం ఆధ్వర్యంలోని గదుల ధరలు తగ్గించారు. రూ.300 ఉన్న సాధారణ గది ధరను 100 రూపాయలు చేశారు. మొత్తం 140 గదులు 100 రూపాయలకే అందుబాటులోకి తెచ్చారు. బృందావన్ గార్డెన్స్‌లోని 83 గదులు, పంచముఖి దర్శన్‌లో 34 గదులు, గెస్ట్ హౌస్ మొదటి అంతస్థులో 28 గదుల ధరలను తగ్గించారు. ఈ నిర్ణయం పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
వీటితోపాటు త్వరలో 300 గదులు నిర్మిస్తామనీ.. వాటిని 25 రూపాయలకే భక్తులకు ఇవ్వనున్నట్లు ఆలయ అధికారులు చెప్పారు. ప్రస్తుతం 3 అంతస్తుల భవనం నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు.