సంతోషంగా స్నేహితులతో పుట్టినరోజు వేడుకలు జరుపుకొనేందుకు వెళ్లిన యువకుడు శవమై కనిపించాడు. అతనితో పాటు మరో యువకుడు నీట మునిగి చనిపోయాడు.
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన ఆరిఫ్.. తన నలుగురు స్నేహితులతో కలిసి పుట్టినరోజు వేడుకలు చేసుకునేందుకు.. గురువారం రుద్రవరం పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతం దగ్గర్లోని గల్లేరు జలాశయానికి వెళ్లారు. స్నేహితులంతా మద్యం తాగి సంబరాలు చేసుకున్నారు.
అదే మత్తులో జలాశయం పరిధిలోని ఓ నీటి గుంతలో ఈతకు దిగారు. ఆరిఫ్, సులేమాన్ ఈత రాక నీట మునిగి పోయారు. సమాచారం అందుకున్న రుద్రవరం ఎస్సై రామ్మోహన్ రెడ్డి.. గజ ఈతగాళ్లు, అగ్నిమాపక సిబ్బంది సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి కావడంతో గాలింపు చర్యలు నిలిపివేశారు. శుక్రవారం గాలింపు చర్యలు కొనసాగించి ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు. అయితే మద్యం మత్తులో తమ వారిపై దాడి చేసి హత్య చేశారని యువకుల బంధువులు ఆరోపిస్తున్నారు.
కడపలో..
కడప జిల్లా, ఓబులవారిపల్లె మండలం, మంగంపేట వద్ద కారు, మోటార్ సైకిల్ ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికులు, పోలీసులు ఇచ్చిన వివరాల మేరకు పుట్టినరోజు సందర్భంగా స్నేహితులిద్దరూ సంతోషంగా సరదాగా గడపాలని ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తుండగా మార్గమధ్యంలో రోడ్డు ప్రమాదం జరిగి ఒకరు మృతి చెందడంతో బతికున్న స్నేహితుల్ని ఆస్పత్రిలో చేర్చారు.
రైల్వే కోడూరు కు చెందిన షేక్ గౌస్, ఓబులవారిపల్లె మండలం కొర్లకుంట బలిజేపల్లి గ్రామానికి చెందిన దిలీప్ ఇద్దరు ఎస్వీ జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. పుట్టినరోజు సందర్భంగా స్నేహితులిద్దరూ సరదాగా కొర్లకుంట నుంచి వాహనంలో వెళ్తుండగా పుల్లంపేటకు పోతున్న కారును ఢీ కొట్టారు. ప్రమాదంలో షేక్ గౌస్ మృతి చెందగా, దిలీప్ గాయలపాలయ్యాడు. దాంతో అతన్ని 108 వాహనంలో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: Thief arrest: ఎర్రగుంట్లలో అంతరాష్ట్ర దొంగ అరెస్ట్