కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం ఓంకారం క్షేత్రంలో అర్చకులపై..వైకాపా నేత, ఆలయ ఛైర్మన్ దాడికి పాల్పడ్డారు. బాధితులు తెలిపిన సమాచారం ప్రకారం...ఆలయ అర్చకులు మృగపాణి, అతని తండ్రి సుధాకర్ రావులపై ఆలయ ఛైర్మన్ పిట్టం ప్రతాప రెడ్డి, నాగరాజు, ఈశ్వర్ అనే వ్యక్తులు దాడి చేశారు. ఉచిత దర్శనానికి భక్తుల నుంచి టికెట్ రుసుము వసూలు చేయడాన్ని అర్చకులు ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో అర్చకులు, సిబ్బందికి వాగ్వాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న ఆలయ ఛైర్మన్ ప్రతాప రెడ్డి అక్కడికి చేరుకుని అర్చకులను చెండ్రకొలుతో చితకబాదారు. అడ్డు వచ్చిన అర్చకుడు తండ్రి సుధాకర్ రావుపై దాడి చేశారు. ఈ ఘటనపై అర్చకుడు మృగపాణి బండి ఆత్మకూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అర్చకుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నంద్యాల డీఎస్పీ చిదానంద రెడ్డి తెలిపారు.
ఆలయ ఛైర్మన్‌పై కేసు నమోదు
ఓంకారం క్షేత్రంలో అర్చకులపై దాడి ఘటనపై విచారణ చేపట్టినట్లు నంద్యాల డీఎస్పీ చిదానందరెడ్డి తెలిపారు. ఆలయ ఛైర్మన్ ప్రతాపరెడ్డి తనపై దాడి చేసినట్లు అర్చకులు మురుగు పాణి శర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
అర్చకులపై దాడి హేయమైన చర్య : తెదేపా
కర్నూలు జిల్లా ఓంకారం క్షేత్రంలో పూజారులపై చేయి చేసుకున్న ఆలయ ఛైర్మన్ ప్రతాప్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు వేమూరి ఆనంద్ సూర్య డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వం బ్రాహ్మణుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. అర్చకులపై ఆలయ ఛైర్మన్ దాడి హేయమైన చర్యని ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్తిక సోమవారం కావడంతో సాయంత్రం కూడా పరమేశ్వరుని దర్శనం కల్పించాలనే సదుద్దేశంతో ఆలయ పూజారులు భక్తులకు టికెట్లు ఇచ్చారని, టికెట్లు ఇచ్చి దైవ దర్శనం కల్పించడం నేరమా అని నిలదీశారు. ఆశీర్వదించే పూజారులపై దాడి చేయటానికి ఛైర్మన్‌కు చేయి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఆధ్మాత్మిక చింతన లేని వారందరినీ ఆలయ ఈవోలు, ఛైర్మన్లుగా వైకాపా ప్రభుత్వం నియమించిందని ఆరోపించారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌ను వైకాపా నిర్వీర్యం చేసిందని ఆనంద్ సూర్య విమర్శించారు. లాక్డౌన్లో ఉపాధి కోల్పోయిన అర్చకులను ఆదుకునేందుకు మనసు రాలేదని దుయ్యబట్టారు. కరోనా సోకి చనిపోయిన పూజారులకు రూ.50 లక్షల బీమా సౌకర్యం అందలేదని, అర్చకులకు రూ.10 వేల జీతం ఇస్తానని జగన్ మాట తప్పారని ఆరోపించారు.
ఇదీ చదవండి : ప్రశ్నించినందుకే అర్చకులను కొట్టారు..!