4రోజులుగా కురుస్తున్న వర్షాలతో కర్నూలు జిల్లా తడిసి ముద్దమవుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. రహదారులు నీట మునిగడంతో ప్రయాణాలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. డోన్, నంద్యాల, శిరివెళ్ల, ఆళ్లగడ్డ, హాలహర్వి, నందికొట్కూరు, ఆత్మకూరు, పాణ్యం, తదితర మండలాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. హాలహర్వి వద్ద వాగు ఉద్ధృతికి తాత్కాలిక వంతెన కోతకు గురై రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కర్నూలు-బళ్లారి జాతీయ రహదారిపై వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. హొళగుంద మండలంలో వేదవతి నది ఉగ్రరూపం దాల్చడంతో సమీప గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆళ్లగడ్డ మండలం అహోబిళం వద్ద కాల్వ కట్ట తెగిపోవటంతో విద్యుత్ సబ్ స్టేషన్లో భారీగా వర్షం నీరు నిలిచింది. ఆళ్లగడ్డ మండలంలో బాచేపల్లి తండా వద్ద తెలుగుగంగ 23వ బ్లాక్ కట్ట తెగిపోయి వందల ఎకరాల పంటపొలాలు నీటి మునిగాయి. భారీ వర్షాలు కొనసాగుతుండటంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న ఆందోళనలో కర్నూలు జిల్లా వాసులున్నారు.
ఇదీ చదవండి : నంద్యాల డివిజన్ పరిధిలో భారీ వర్షం