గతేడాది సెప్టెంబరులో కురిసిన భారీ వర్షాలకు కర్నూలు జిల్లాలోని మండలాల్లో ఎక్కువ పంటలు నీట మునిగాయి. ఆళ్లగడ్డ, బండి ఆత్మకూరు, చాగలమర్రి, దొర్నిపాడు, గడివేముల, గోస్పాడు, కోవెలకుంట్ల, మహానంది, నంద్యాల, నందికొట్కూరు, మిడుతూరు, రుద్రవరం, సంజామల, శిరువెళ్ల, పాణ్యం, పగిడ్యాల, ఉయ్యాలవాడ, బేతంచర్ల, అవుకు, ప్యాపిలి, కౌతాళం, డోన్, ఆదోని, మంత్రాలయం.. ఇలా మొత్తం 24 మండలాల పరిధిలో పంట నష్ట వివరాలను అధికారులు అంచనా వేసి ప్రభుత్వానికి పంపారు. 16,347 మంది రైతులకు 11,424 హెక్టార్లలో రూ.15.85 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ నివేదికలిచ్చింది. మరోవైపు ఉద్యానశాఖ సైతం అరటి, పసుపు, మిర్చి తోటలు దెబ్బతిన్నట్లు అంచనాలు సిద్ధం చేసి నివేదికలిచ్చింది.
సీఎం హామీ అమలేదీ?
వరి, పత్తి, వేరుశనగ పంటలకు హెక్టారుకు రూ.15 వేలు, మొక్కజొన్నకు రూ.12 వేలు, మినుము, పెసలు, కంది పంటలకు రూ.10 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇప్పటికే జిల్లాలో రూ.13.05 కోట్ల పరిహారం రైతుల ఖాతాల్లో పడింది. గత సెప్టెంబరు 21న నంద్యాలకు వచ్చిన ముఖ్యమంత్రి గత ప్రభుత్వాలిచ్చే పరిహారం కంటే 15 శాతం పెంచి ఇస్తానని బాధిత రైతులకు భరోసా ఇచ్చారు. అయితే జీవో రాకపోవడంతో పాత పద్ధతిలోనే నష్టపరిహారాన్ని రైతుల ఖాతాల్లో ప్రస్తుతం జమ చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
అర్హులకు అందని వైనం..
పొలాల్లో పంటలు దెబ్బతిన్న చాలామంది లబ్ధిదారులకు పరిహారం అందలేదు. పక్క పొలాల్లోని రైతులకు నగదు ఖాతాల్లో జమై తమకు కాలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో అధికారులకు మొర పెట్టుకున్నా సరైన సమాధానం లేదని చెబుతున్నారు. బ్యాంకు ఖాతా నంబరులో తప్పులు, ఆధార్ అనుసంధానం వంటి సమస్యలతో నగదు పడని వారికి మళ్లీ సరిచేయాల్సి ఉంటుందని జిల్లా అధికారులు పేర్కొంటున్నారు. ఇలా చూస్తే రూ.2.80 కోట్ల వరకు ఇంకనూ లబ్ధిదారుల చెంతకు చేరనట్లు స్పష్టమవుతోంది.
ఉన్నతాధికారుల దృష్టికి...
అప్పటి వర్షాలతో 1,455 హెక్టార్లల్లో ఉద్యాన పంటలు నష్టపోయినట్లు ఆ శాఖ అధికారులు గుర్తించి నివేదికలిచ్చారు. అధిక వర్షాలకు సంబంధించి పరిహారం విడుదల చేసే సమయానికి వ్యవసాయశాఖతోపాటు పంపిన ఉద్యానశాఖ నివేదికలు సచివాలయంలో జరిగిన పొరపాటుతో ప్రభుత్వానికి అందలేదు. ఫలితంగా వ్యవసాయ శాఖకు సంబంధించిన పరిహారాన్నే విడుదల చేశారు. 2,496 మంది ఉద్యాన రైతులకు రూ.2.22 కోట్ల మేర నిధుల ఆమోదానికిగాను స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, ఐఏఎస్ అధికారిణి ఉషారాణి దృష్టికి జిల్లా అధికారులు ఇప్పటికే తీసుకెళ్లారు. ఆ దస్త్రానికి ఎప్పుడు మోక్షం కలిగితే అప్పుడు రైతుల బాధలు తీరనున్నాయి.
చుట్టుపక్కలవారికి వచ్చింది
నాకు కానాల శివారులో 1,222 సర్వే నంబరులో రెండెకరాల పొలం ఉంది. గతేడాది వరి పంట సాగు చేశా. 2019 సెప్టెంబరులో కురిసిన భారీ వర్షాలకు పంట నీట మునిగి పూర్తిగా దెబ్బతింది. పంట నష్టపరిహారానికిగాను వ్యవసాయాధికారులు వచ్చి పేర్లు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం నా పొలానికి నలువైపులా ఉన్న రైతుల ఖాతాల్లో పరిహారం జమైంది. నాకు మాత్రం అందలేదు. అధికారుల వద్దకు వెళ్లినా సరైన సమాధానం లేదు. - రజాక్, కానాల గ్రామం
నగదు జమ కాలేదు
నా పక్కన ఉన్న పొలాల్లో పంట దెబ్బతిన్న వారికి సంబంధించి వారి ఖాతాలో పరిహారం పడింది. నా రెండు ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నా నగదు ఖాతాలోకి రాలేదు. మేమైతే ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామని, ఎందుకు రాలేదో తమకు తెలియదని అధికారులు చెబుతున్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు.
- హుస్సేన్,కానాల గ్రామం
-
ఇదీ చదవండి: