అతడో పత్తి వ్యాపారి... ఏజెంట్ల నుంచి కోటిన్నర రూపాయల కంటే ఎక్కువ విలువ గల పత్తిని కొనుగోలు చేశాడు. డబ్బు మాత్రం ఇవ్వలేదు. ఏజెంట్లు డబ్బులడిగితే అదిగో ఇస్తా... ఇదిగో ఇస్తానని తప్పించుకు తిరిగాడు. చివరికి కుచ్చుటోపీ పెట్టి అక్కడనుంచి పరారయ్యాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగింది.
పట్టణానికి చెందిన శివనారాయణ పత్తి వ్యాపారం చేసేవాడు. ఆదోని మార్కెట్ యార్డులో సాయి గణేశ్ కాటన్ ట్రేడర్స్ పేరుతో కమీషన్ ఏజెంట్ల నుంచి పత్తిని కొనుగోలు చేసేవాడు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 28 వరకు 54 మంది కమీషన్ ఏజెంట్ల నుంచి 1 కోటి 58 లక్షల విలువ చేసే పత్తిని కొనుగోలు చేశాడు. 14 రోజుల తర్వాత ఏజెంట్లకు శివ నారాయణ నగదు చెల్లించాల్సి ఉండగా.. ఏవేవో కారణాలు చెప్తూ వచ్చాడు. 14న శివ నారాయణ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయటం వల్ల అనుమానం వచ్చిన కమీషన్ ఏజెంట్లు ఇంటికి వెళ్లి చూశారు. ఇంటికి తాళం వేసి ఉండటంతో మోసపోయామని గ్రహించిన కమీషన్ ఏజెంట్లు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చంద్రశేఖర్ వెల్లడించారు.
ఇదీ చదవండి: కడుపుతో ఉన్న భార్యను కిరాతంగా చంపాడు!