Varra Ravinder Reddy Case : చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తోపాటు షర్మిల, సునీత, విజయమ్మలపై జుగుప్సాకరమైన పోస్టులు పెట్టి వేధించిన పులివెందులకు చెందిన వర్రా రవీందర్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. వర్రాను కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. అయితే తీగలాగితే డొంక కదిలినట్లు ఈ సామాజిక మాధ్యమ అనుచిత పోస్టుల వ్యవహారం కడప ఎంపీ అవినాష్ రెడ్డి మెడకు చుట్టుకుంటోంది.
షర్మిల, సునీతలపై పోస్టులను అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి సూచనల మేరకే వర్రా రవీందర్‌రెడ్డి పెట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వేదికగానే ఆ పార్టీ సామాజిక మాధ్యమ సైకో ముఠా వికృత చేష్టలకు తెగబడిందని పోలీసుశాఖ స్పష్టం చేసింది. ఈనెల 5న తప్పించుకున్న వర్రాను ఈనెల 10న రాత్రి 11:30 గంటలకు ప్రకాశం జిల్లా మార్కాపురం వద్ద పట్టుకున్నారు.
ఈనెల 8న పులివెందుల పోలీస్ స్టేషన్లో సింహాద్రిపురం మండలానికి చెందిన హరి అనే దళితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వర్రా రవీందర్‌రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, ఐటీ యాక్టు, బీఎన్ఎస్ యాక్టులోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ-1గా వర్రా, ఏ-2 సజ్జల భార్గవ్‌రెడ్డి, ఏ-3 అర్జున్‌రెడ్డి పేర్లను చేర్చారు. ప్రస్తుతం ఈ కేసులో ఏ-1గా ఉన్న వర్రా రవీందర్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. అయితే అతను ఈనెల 5న తప్పించుకుని పారిపోయేందుకు సహకరించిన భారతీ సిమెంట్ ఫ్యాక్టరీ ఉద్యోగులు ఉదయ్‌రెడ్డి, సుబ్బారెడ్డిలనూ అరెస్ట్ చేశారు.
2012లో వర్రా రవీందర్‌రెడ్డి భారతీ సిమెంట్ కర్మాగారంలో ఉద్యోగంలో చేరాడు. 2019 నుంచి వైఎస్సార్సీపీ సామాజిక మాధ్యమ కార్యకర్తగా పనిచేస్తున్నాడు. ప్రభుత్వ రంగ సంస్థ డిజిటల్ మీడియా కార్పొరేషన్లో ఉద్యోగిగా జీతం తీసుకుంటూ వైఎస్సార్సీపీకి పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వర్రా రవీందర్‌రెడ్డి వైఎస్సార్ జిల్లా కన్వీనర్ వివేక్‌రెడ్డి సూచనల మేరకు పనిచేసే వారని నిర్ధారించారు. షర్మిల, సునీతలపై పోస్టులు పెట్టడం వెనక అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి పాత్ర ఉందని తేలింది.
"నిందితులు వాడిన భాష చాలా దారుణంగా, అసభ్యంగా ఉంది. వీరు తాడేపల్లిలోని పీవీఆర్ ఐకాన్ బిల్డింగ్ మూడో అంతస్తులో కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. అక్కడి నుంచే పోస్టులు పెట్టేవారు. వైఎస్సార్సీపీని వ్యతిరేకించే నాయకులు, వారి కుటుంబ సభ్యులు, మహిళల ఫొటోలు మార్ఫింగ్ చేశారు. నిందితులు పెట్టిన పోస్టులను చదవడానికి మేం కూడా ఇబ్బంది పడుతున్నాం. గతంలో ప్రతిపక్ష నేతల మనోధైర్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా పోస్టులు పెట్టారు." - కోయ ప్రవీణ్, కర్నూలు రేంజ్ డీఐజీ
ఎంపీ అవినాష్ రెడ్డి ప్రమేయం : రాఘవరెడ్డి ఇచ్చే కంటెంట్‌ను వర్రా సోషల్ మీడియాలో పోస్టు చేసేవారని పోలీసులు తెలిపారు. షర్మిల, సునీతలపై ఏవిధమైన పోస్టులు ఎలా రాసి పెట్టాలనే అంశాలను కడప ఎంపీ అవినాష్ రెడ్డి చెబుతుంటే ఆయన పీఏ రాఘవరెడ్డి డైరీలో రాసుకుని వాటిని వర్రా రవీందర్‌రెడ్డి పంపేవారని వెల్లడించారు. ఈ కేసులో అవినాష్ రెడ్డి, రాఘవరెడ్డి పాత్రపై లోతుగా విచారణ చేస్తామని పోలీసులు వివరించారు.