Congress Dimond On Cbi Enquiry: తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల వ్యవహారం మరొకసారి తెరపైకి వచ్చింది. ఇటీవల రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఎమ్మెల్యేలకు ఎర కేసు నేపథ్యంలో. భారాస-బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగా.. ఈ పంచాయితీలోకి కాంగ్రెస్ వెళ్లేందుకు సిద్ధమైంది. ఎమ్మెల్యేలకు ఎర కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ రెండు కోణాల్లో చూడాలని పీసీసీ కోరుతోంది. రెండు పార్టీలను బాధితులుగా చూపుతున్నారని.. ఇందులో దోషి ఎవరో..? నిర్దోషి ఎవరో సీబీఐ తేల్చాలని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కోరారు.
నేరం జరిగిందని అంటూనే.. విచారణ తామే చేస్తామనటంతో భారాస లోపం బయటపడుతుందన్న కాంగ్రెస్.. నేరమే జరగలేదంటూ సీబీఐ విచారణ కోరటంతో భాజపా లోపం బయటపడుతుందని పీసీసీ అధ్యక్షుడు పేర్కొన్నారు. ఇటీవల ఈ కేసు విచారణను హైకోర్టు.. సీబీఐకి అప్పగించిన నేపథ్యంలో ఇంప్లీడ్ పిటిషన్ వేసేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఎమ్మెల్యేలకు ఎర కేసులో నలుగురు ఎమ్మెల్యేలు ఉండగా.. అందులో ముగ్గురు కాంగ్రెస్ నుంచి భారాసలో చేరిన వారే ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి 2018లో అధికార పార్టీలోకి వెళ్లిన 12 మందిలో కొందరికి ప్రభుత్వంలో పదవులు దక్కాయి. అది కూడా లంచం కిందకే వస్తుందని కాంగ్రెస్ వాదిస్తోంది. ఎమ్మెల్యేలకు ఎర కేసు నలుగురికే పరిమితం చేయకుండా.... 2018 నుంచి జరిగిన పరిణామాలపై విచారణ జరపాలని సీబీఐని కోరనున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది.
''మరో వైపు ఇదే అంశంపై రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేసేందుకు కాంగ్రెస్ నాయకులు అపాయిట్‌మెంట్ కోరారు. 2018 నుంచి ఇప్పటి వరకు జరిగిన పార్టీ ఫిరాయింపులపై సీబీఐ విచారణ జరపడం ద్వారా భారాస ప్రలోభాలు బయటపడతాయని కాంగ్రెస్ భావిస్తోంది. సీబీఐ తమ వినతిని స్వీకరించకపోతే న్యాయపరంగా ముందుకు వెళ్లి.. అందులో ఇంప్లీడ్ కావాలని భావిస్తోంది. రాబోయేది ఎన్నికల కాలం అయినందున.. ఈ పరిణామాలు తమ పార్టీకి ప్రయోజనం చేకుర్చుతాయని కాంగ్రెస్ అంచనా వేస్తోంది.'' -మల్లు రవి, పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు
ఇవీ చదవండి: