కర్నూలు జిల్లా చాగలమర్రి మండలంలోని చెంచుగూడెం పరిధిలో వరద కారణంగా వంతెన కొట్టుకుపోయి రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. డి.వనిపెంట పంచాయతీ పరిధిలోని మజరా గ్రామం చెంచుగూడెంలో సుమారు 650 వరకు జనాభా ఉంటుంది.
అటవీ ఉత్పత్తుల సేకరణ, వ్యవసాయం లాంటివి ఇక్కడి వాసులకు ప్రధాన ఆదాయ వనరులుగా ఉంటోంది. గ్రామం నుంచి మండల కేంద్రం సహా ఇతర గ్రామాలకు వెళ్తే కానీ వీరికి జీవనం సాగదు. ప్రస్తుతం భారీ వర్షాలకు గ్రామం ముంగిట ఉండే భావనాశి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
వాగు ఉద్ధృతికి రెండేళ్ల క్రితం తాత్కాలికంగా నిర్మించిన వంతెన కొట్టుకుపోయింది. గతేడాది మరోసారి ఏర్పాటు చేసిన వంతెన సైతం నది ప్రవాహానికి నామరూపాల్లేకుండాపోయింది. ఫలితంగా చెంచుల బాధలు వర్ణనాతీతం అయ్యాయి. రేషన్ సరకులు తెచ్చుకోవాలన్నా.. డీ.వనిపెంటకు రావాల్సి వస్తోంది. ఫలితంగా నదిలో ప్రమాదకరంగా తాడు సాయంతో దాటుతున్నారు.
ఇవీ చూడండి : అమరావతికి ఏం కాదు.. అవి తప్పుడు ప్రచారాలు: రైతులు