విశాఖపట్నంలో వైద్యుడు సుధాకర్ కేసులో పోలీసుల వ్యవహారంపై హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించడాన్ని వైకాపా స్వాగతించింది. సీబీఐతో విచారణ జరిపించడం మంచిదేనని, నిజానిజాలు బయటకు వస్తాయని ఆ పార్టీ ఎంపీ నందిగం సురేష్ అన్నారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపినా సరిగా చేయలేదని అంటారన్నారు.
వైద్యుడు సుధాకర్ ఓ సైకో అని ఎంపీ ఆరోపించారు. సీఎం జగన్ సహా పోలీసులపై బహిరంగంగా బూతులు తిట్టారని మండిపడ్డారు. ఎవరో తెలియకుండా ఉండేందుకు గుండు చేయించుకుని రోడ్డుపై అభ్యంతరకరమైన పదజాలంతో మాట్లాడారని అన్నారు. దీనికి సంబంధించిన వీడియోలను ప్రదర్శించారు.
వైద్యుడు సుధాకర్ విషయంలో పోలీసులు ఎంతో సంయమనంతో వ్యవహరించారని ఎంపీ తెలిపారు. దళితుడు అని ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమన్నారు. వైద్యుడి వ్యవహార శైలి వెనుక చంద్రబాబు సహా నేతల హస్తం ఉందని ఆరోపించారు. విచారణ సమయంలో వైద్యుడితో పాటు తెదేపా అధినేత చంద్రబాబును కూడా విచారించాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు కాల్ డేటాను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
పంచాయతీ కార్యాలయాలకు వైకాపా రంగు వేయడం లేదని.. ఏ రంగు వేసినా ఆ రంగు వైకాపాదేనని అంటగడుతున్నారన్నారు. వృద్దురాలు రంగనాయకమ్మతోనూ సోషల్ మీడియాలో తెదేపా నేతలు పోస్టులు పెట్టించారని ఆక్షేపించారు.
ఇదీ చదవండి: 'రాష్ట్రంలో 25 నైపుణ్య శిక్షణా కళాశాలలు'