YCP Leader Illegal Land Grabbing in Gudiwada: గుడివాడ నియోజకవర్గంలో అంతా అధికార పార్టీ నేతలదే రాజ్యం. వారిని కాదని చీమ చిటుక్కుమనే పరిస్థితి లేదు. గతంలో అక్రమాలు వెలుగు చూసినా.. అధికారులు చర్యలు తీసుకోలేదు. తాము అనుమతులు ఇవ్వలేదని చెప్పారే తప్ప అక్రమ తవ్వకాల జోలికి వెళ్లలేదు. నందివాడ మండలంలో పలు గ్రామాల్లో ఒక నేత విచ్చలవిడిగా చేపల చెరువులు తవ్వుతున్నారు. తనకు సీఎం దగ్గరి బంధువు నంటూ.. స్థానిక ప్రజాప్రతినిధి తనకు అత్యంత సన్నిహితుడు అంటూ అధికారులను సైతం బెంబేలెత్తిస్తున్నారు. భూ యజమానులకు ఎకరాకు 30 వేలు కౌలు ఇచ్చి వ్యాపారుల నుంచి 80 వేలు దండుకుంటున్నారు. ఇప్పటికే సుమారు 150 ఎకరాల వరకు ఇలా సబ్ లీజులకు ఇచ్చారు.
పోరంబోకు, పట్టా భూముల్లో తవ్వకాలు చేస్తూ లీజులకు ఇచ్చి లక్షల రూపాయలు దండుకుంటున్నారు. తాజాగా మరో 50 ఎకరాల్లో తవ్వకాలు సాగిస్తున్నారు. తవ్వకాలన్నింటికీ ఒకే రకం అనుమతులు చూపిస్తున్నారు. 2014లో చినలింగాల గ్రామంలో కొన్ని సర్వే నెంబర్ల పేరుతో మత్స్యశాఖ 40 ఎకరాల చేపల చెరువులు తవ్వేందుకు అనుమతులు జారీ చేసింది. నాటి కృష్ణా జిల్లా కలెక్టర్ ఈ అనుమతి జారీ చేశారు. దీన్ని అడ్డంపెట్టుకుని ఇప్పటికే సుమారు 100 ఎకరాల వరకు తవ్వేశారు.
లక్షల ఎకరాలు చెరువులుగా.. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 1.8 లక్షల ఎకరాలు చెరువులుగా మారాయి. తాజాగా చినలింగాల గ్రామంలో సర్వే నెంబరు 123/2బీ, 227/8,132/2, 227/7లలో సుమారు 50 ఎకరాల్లో తవ్వకాలు జరుగుతున్నాయి. ఒక్కో సర్వే నెంబరుపై 2.5 ఎకరాల చొప్పున దస్త్రాల్లో ఉన్నప్పటికీ వీటితో పాటు పక్కనే ఉన్న కాలువ పోరంబోకు, ప్రభుత్వ బంజరు భూములను కలిపేసుకున్నారు. భారీ యంత్రాలను పెట్టి రాత్రి, పగలు తేడా లేకుండా తవ్వకాలు చేస్తున్నారు. మత్స్యశాఖ అధికారులు 2017 నుంచి ఎవ్వరికీ అనుమతులు ఇవ్వలేదని చెబుతున్నారు. చేపల సాగుకు ప్రత్యేక అనుమతులు కావాల్సి ఉంటుంది. రెవెన్యూ నుంచి ఎన్‌ఓసీతో పాటు పీసీబీ నుంచి అనుమతి కావాల్సి ఉంది.
అనుమతులు లేకుండా యథేచ్చగా తవ్వకాలు.. మత్స్యశాఖ వివిధ స్థాయిలో పరిశీలన చేసి అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. వ్యవసాయ, గనుల, ఇరిగేషన్, కాలుష్య నియంత్రణ శాఖలు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలి. తర్వాత జిల్లా స్థాయి కమిటీ నుంచి అనుమతి పొందాలి. ఇంత తతంగం ఉన్నా.. ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్చగా చేపల చెరువులు తవ్వేస్తున్నారు. గుడివాడలో ఎలాంటి తవ్వకాలైనా.. ప్రశ్నించే సాహసం అధికారులు చేయడం లేదు. అనుమతులు లేని తవ్వకాలపై చినలింగాల వీఆర్వో స్పందిస్తూ గతంలో జరిపిన తవ్వకాలను నిలిపివేశామని ప్రస్తుతం ఎలాంటి తవ్వకాలు జరగటం లేదని సమాధానమిచ్చారు.