వైకాపా అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ది, ఉపాధి కల్పన లేవని శాసమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. కరోనాతో రాబోయే 3 ఏళ్లు ఇదే పరిస్థితి ఉండవచ్చు... లేదా ఇంకా దిగజారవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. నీతి ఆయోగ్ బుధవారం విడుదల చేసిన 'ఎగుమతుల సన్నద్ధత సూచి- 2020' ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ 20వ స్థానంలో నిలవటంపై యనమల ఆవేదన వ్యక్తం చేశారు. ఎగుమతుల విధానం పరంగా ఏపీ పనితీరు నాసిరకమని నీతి అయోగ్ మొట్టికాయ వేసిందని తెలిపారు.
తీర ప్రాంతం లేని తెలంగాణకు 6వ స్థానం వస్తే... 12 పోర్టులు ఉన్న ఏపీకి 20వ స్థానమా?. ఉన్న పరిశ్రమలను పోగొట్టారు వచ్చిన పెట్టుబడులను తరిమేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది జగన్‌కు అర్థంకాని అంశంగా మారింది. రాష్ట్ర పారిశ్రామిక రంగానికి 5 లక్షల కోట్ల రూపాయల నష్టం చేశారు. వైకాపా ప్రభుత్వ వైఫల్యాలతో 2024 దాకా పారిశ్రామిక వృద్ధి రేటు గుండుసున్నానే. తొలి 3 స్థానాల్లో ఉండే రాష్ట్రాన్ని అట్టడుగు 3 స్థానాల్లోకి నెట్టిన ఘనత జగన్‌దే. ఎగుమతుల్లోనే కాదు పరిపాలనలోనూ సన్నద్ధత లేదు... సమర్థత లేదు. నీతి అయోగ్ నివేదికతో పాటు కరోనా నియంత్రణలోనూ అదే బయటపడింది. ఈ దుస్థితికి ముఖ్యమంత్రి జగన్ బాధ్యత వహించాలి- యనమల రామకృష్ణుడు, మండలి ప్రతిపక్ష నేత