కృష్ణా జిల్లా దివి సీమలో పశువులకు కొత్త కష్టం వచ్చింది. అన్నదాతను అన్నివిధాలా ఆదుకుంటున్న ఆవులకు, ఎడ్లకు... ఒంటిపై బొబ్బలు రావడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒక ప్రక్క కొవిడ్-19 ప్రభావం వల్ల ఇబ్బందులు పడుతూ బిక్కు బిక్కు మని గడుపుతుంటే... ఇప్పుడు పశువులకు వింత వ్యాధి రావడం వల్ల ఏమి చేయాలో తెలియక పాడి రైతన్నలు తల్లడిల్లుతున్నారు.
బొబ్బలు వచ్చిన ఆవులను కొందరు రైతులు తమ పొలంలో పశుగ్రాసం తినేందుకు అనుమతించటం లేదు. ఈ వైరస్ తమ పశువులకు వస్తుందని కొందరు గేదెలను సైతం తక్కువ రేటుకు అమ్ముకుంటున్నారు. నాగాయలంకలో సుమారు 500 ఉన్న ఆవుల మందలో 60 ఆవుల చర్మంపై బొబ్బలు వచ్చాయి. అవి ప్రక్కన ఉన్న అవులకు సైతం అంటుకున్న తీరుపై పశుకాపరులు సైతం భయబ్రాంతులకు గురవుతున్నారు.
ఈ విషయాన్ని స్థానిక పశువైద్య అధికారులకు తెలుపగా కొన్ని రకాల ఇంజక్షన్లు ఇచ్చారని.. అయినప్పటికీ మచ్చలు తగ్గకపోగా ఇంకా పక్కవాటికి రావడం వల్ల ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉండిపోయామని వాపోతున్నారు. పశు సంవర్ధక శాఖ ఉన్నతాధికారులు స్పందించి రక్త నమూనాలు సేకరించి ఈ బొబ్బల వ్యాధి నుంచి పశువులను కాపాడాలని రైతులు కోరుతున్నారు. ఈ వ్యాధి రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో రైతులకు వివరించాలని పశువుల యజమానులు విన్నవించుకున్నారు.
ఇదీ చదవండి: