కృష్ణా జిల్లా నూజివీడులో రెండు వర్గాలు ఘర్షకు దిగాయి. ఫలితంగా ఇరు వర్గాల దాడిలో ఏరియా ఆస్పత్రి ఫర్నిచర్ ధ్వంసమైన ఘటన తీవ్ర సంచలనంగా మారింది. నూజివీడు పట్టణం వెలమ పేటకు చెందిన ఝాన్సీ, రవిలు 7 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి వివాహాన్ని ఇరువురు పెద్దలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఇరువర్గాల దాడి..
ఝాన్సీ సోదరుడి స్నేహితులు స్థానిక గొడుగు వారి గూడేనికి చెందిన జీవన్ ప్రకాష్, శ్రీనివాస రావు, జై ప్రకాష్ (తండ్రీకొడుకులు), మెకానిక్ దుర్గ (రౌడీ షీటర్), ఝాన్సీ భర్త రవి స్నేహితులు బోను హేమంత్ కుమార్, మాదిరెడ్డి దుర్గా రావు, సతీష్, దాసుల మధ్య బైపాస్ రోడ్డులో తోపులాట చోటు చేసుకుంది.
రౌడీ షీటర్‌పై దాడి..
సోమవారం మెకానిక్ దుర్గ వెళ్తుండగా.. హేమంత్ కుమార్ అతనిపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ మెకానిక్ దుర్గను నూజివీడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
పరస్పరం రాళ్లతో..
ఆస్పత్రి ఆవరణంలో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకుని పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఘటనలో ఆస్పత్రికి చెందిన ఫర్నిచర్, అద్దాలు, ఇతర సామగ్రి ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న సీఐ వెంకటనారాయణ స్వయంగా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పెళ్లి కుమారుడు రవి వర్గంలో 12 మందిపై, ఝాన్సీ సోదరుడు రవి వర్గంలో 8 మందిపై కేసులు నమోదు చేశారు.
ఎస్పీ కౌన్సిలింగ్..
నూజీవీడు ఏరియా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు మరో కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడిన ఇరు వర్గాలకు చెందిన 20 మందిని రాత్రి మచిలీపట్నంలోని కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు కార్యాలయానికి తరలించారు. ఇరు వర్గాల వారికి ఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు.