tribute to ntr : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని పలువురు వక్తలు పేర్కొన్నారు. నిస్వార్థ రాజకీయాలకు ఎన్టీఆర్ చిరునామా అని తెలిపారు. ఎన్టీఆర్ 27వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలువురు టీడీపీ నేతలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
బాపట్ల జిల్లాలో.. బాపట్ల జిల్లా చీరాల బస్టాండ్ కూడలిలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి టీడీపీ నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పేదప్రజల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలను కొనియాడారు.
ఒంగోలులో.. ఒంగోలులోని పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి.. మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ పేదలకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పెద్దఎత్తున కార్యకర్తలు రక్తదానం చేశారు.
అనంతపురం జిల్లాలో.. కళ్యాణదుర్గం ఎన్టీఆర్ భవన్ ముందు ఆయన విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలవేసి ప్రార్థనలు చేశారు. అనంతరం "జై ఎన్టీఆర్" అంటూ కార్యకర్తలు చేసిన నినాదాలతో పరిసర ప్రాంతాలు మార్మోగాయి. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు స్వర్గీయ ఎన్టీ రామారావు బాటలో నడిచేలా ఆదర్శవంతమైన రాజకీయాలు చేశారని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు కొనియాడారు.
కడప జిల్లాలో.. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి కడపలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. భారీ సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు, నాయకులు హాజరయ్యారు.
అనకాపల్లి జిల్లాలో.. ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరనీయుడని తెలుగు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. పేదల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలను ప్రవేశపెట్టారని తెలిపారు. ఎన్టీఆర్ ఆశయ సాధనకు తెదేపా కార్యకర్తలందరూ కృషి చేయాలని కోరారు.
ఇవీ చదవండి :