విజయవాడ - నూజివీడు రహదారిపై అజిత్‌సింగ్ నగర్ వద్ద డివైడర్‌పై వేసిన మొక్కలు బాగా పెరిగి.. కొమ్మలు రహదారులపైకి చొచ్చుకువచ్చాయి. ఈ చెట్ల వేర్లు కారణంగా డివైడర్ కూడా ధ్వంసం అవుతోంది. దీంతో వీటిని తొలగించి, పెద్దగా ఎత్తు పెరగని మొక్కలను నాటాలని వీఎంసీ నిర్ణయించింది. ఇందుకుగాను బాగా ఎదిగిన పొగడ, తురాయి, కానుగ, తదితర 50 చెట్లను గుర్తించింది. అయితే వీటిని నరికేయకుండా.. శాస్త్రీయంగా తొలగించి నాటాలని కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశించారు. దీంతో ఉద్యాన విభాగం ట్రీ ట్రాన్స్‌లొకేషన్ పద్ధతిని ఎంచుకుంది. రెండు విడతల్లో వీటిని తొలగించి.. మొదటి విడతలో 23 చెట్లను సింగ్‌నగర్ పైవంతెన పక్కనున్న అమ్మ ఉద్యానవనంలో నాటారు. రెండో విడతలో తొలగించిన 27 చెట్లను కండ్రికలో పునఃప్రతిష్టించారు.
బెంజ్ సర్కిల్ వంతెన రెండో భాగం పనులు ఊపందుకున్నాయి. దీనికోసం పెద్ద ఎత్తున గ్రీన్ బెల్ట్‌ను ఎన్‌హెచ్ అధికారులు తొలగించారు. దాదాపు పదేళ్లకు పైగా వయస్సున్న అనేక చెట్లు నేలకూల్చారు. అటవీ శాఖ నుంచి అనుమతి తీసుకొని 178 చెట్లను కొట్టేశారు. సుమారు 1.50 కి.మీ మేర పచ్చదనం మాయమైంది. ఇప్పటికే మొదటి భాగం నిర్మాణ సమయంలోనూ పెద్ద సంఖ్యలో చెట్లు నరికేశారు. పచ్చదనాన్ని కొట్టేస్తూ పోతుండడంతో ఆయా ప్రాంతాలు కాంక్రీట్ జంగిల్‌గా మారుతున్నాయి. దీంతో ట్రీ ట్రాన్స్ లొకేషన్ వినియోగించుకొని ప్రకృతి సమతుల్యతను కాపాడవచ్చు అంటున్నారు అధికారులు. ఇందులో భాగంగా తొలి ప్రయత్నంలోనే విజయం సాధించిన ఉద్యాన విభాగం.. మున్ముందు ఇదే పంథాను కొనసాగిస్తామని స్పష్టం చేస్తోంది.
అభివృద్ధి పనులకు అడ్డు వచ్చాయని ప్రాణాధారమైన చెట్లను విచ్చలవిడిగా నరుకుతూ పోవడం కంటే.. ప్రత్యామ్నాయంగా ఆచరణలో ఉన్న ట్రీ ట్రాన్స్‌లొకేషన్ పద్ధతిని అనుసరించాల్సి ఉంది. ఇలాగే వీఎంసీ ఆచరించి, ఫలితాన్ని పొందిన విధానం అన్ని శాఖలూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.
ఇవీ చూడండి...