కృష్ణా జిల్లా నూజివీడులో గజదొంగ బండి దుర్గాప్రసాద్.. అతనికి సహకరిస్తున్న లంకే శ్రీ రామ్ అనే వ్యక్తిని నూజివీడు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 2.30 లక్షల విలువైన బంగారు నగలు, కారు, హోండా యాక్టివా స్కూటర్లను స్వాధీనం చేసుకున్నారు.
ముసునూరు మండలం వేలుపుచర్ల గ్రామంలో అట్లూరి దుర్గా నాగేశ్వరరావు ఇంట్లో గత నెల 29వ తేదీన 18 1/2 కాసుల బంగారు నగలు చోరీ చేసినట్లు నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు తెలిపారు. నూజివీడు పట్టణంలో హోండా యాక్టివాను దుర్గాప్రసాద్ దొంగిలించాడని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలను గడగడలాడిస్తున్న గజదొంగ దుర్గాప్రసాద్ గడచిన పదిహేనేళ్లులో సుమారు 56 దొంగతనాలకు పాల్పడినట్లు చెప్పారు. ఇప్పటికే 25 కేసులలో దుర్గాప్రసాద్ శిక్ష అనుభవించి జైలు నుంచి బెయిలుపై విడుదలైనట్లు వివరించారు. సీసీఎస్ డీఎస్పీ మురళి కృష్ణ ఆధ్వర్యంలో నూజివీడు రూరల్ ఎస్సై రంజిత్ కుమార్, సీసీఎస్ ఎస్సై అజయ్ కుమార్, ముసునూరు ఎస్సై రాజారెడ్డి మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి క్లూస్ ఆధారంగా గజదొంగతో పాటు అతని అనుచరుడిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ వివరించారు.
'మత విద్వేషాలు రెచ్చగొడితే ఫిర్యాదు చేయండి'
నూజివీడు హనుమాన్ జంక్షన్ రోడ్లో యస్ స్క్వేర్ కళ్యాణ మండపంలో గ్రామ రక్షక దళాల శిక్షణా సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలీస్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎవరైనా మతవిద్వేషాలు రెచ్చగొడితే తమకు ఫిర్యాదు చేయాలని డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.
ఇదీ చదవండి: దుర్గ గుడి వెండి సింహాల కేసులో నిందితులు అరెస్టు.. చోరీ ఎలా జరిగిందంటే?